గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:20

నవ వధువు బలవన్మరణం

నవ వధువు బలవన్మరణం

ప్రేమించి పెండ్లి చేసుకున్న వారం రోజుల్లోనే..

అత్తింటి వారు ఆదరించలేదని సూసైడ్‌నోట్‌

జనగామ రూరల్‌: ప్రేమించి పెండ్లి చేసుకున్న వారం రోజుల్లోనే నవ వధువు బలవన్మరణానికి  పాల్పడింది. అత్తింటి వారు ఆదరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌నోట్‌ రాసింది. ఈ ఘటన జనగామలో ఆదివారం చోటుచేసుకున్నది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన శ్రీలేఖ(21), దేశబోయిన మనోహర్‌ ప్రేమించుకున్నారు. ఈనెల 17న ఇంటి నుంచి పారిపోయారు. అదే రోజు అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కాగా వీరు ఈనెల 22న హైదరాబాద్‌లో పెండ్లి చేసుకొని అదే రోజు జనగామ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఇరువర్గాల తల్లిదండ్రులను పిలిపించగా వారు అమ్మాయిని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. షెల్టర్‌ కోసం ఆమెను జనగామలోని సఖీ సెంటర్‌కు పంపించారు. సఖీ సెంటర్‌లో ఆదివారం శ్రీలేఖకు కౌన్సెలింగ్‌ ఇస్తుండగా.. మధ్యలోనే బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే చున్నీతో ఉరివేసుకొని చనిపోయింది. ‘నా చావుకు అబ్బాయి తల్లిదండ్రులు కారణం’ అని సూసైడ్‌ నోట్‌ రాసింది. అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ తెలిపారు.


logo