గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:58:51

ఎంత పనిజేస్తివిరా కొడుకా

ఎంత పనిజేస్తివిరా కొడుకా

  • బెహరాన్‌లో జగిత్యాల జిల్లా యువకుడి ఆత్మహత్య
  • ‘సారీ అమ్మా’ అంటూ వాట్సాప్‌లో చివరి మాట

కోరుట్ల రూరల్‌: ‘అమ్మా, నాన్న బాగున్నారా?.. అక్కలను మంచిగ చూస్కోండి.. నా గుండె భారమవుతున్నది.. భయమేస్తున్నది.. సారీ అమ్మా..’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌కు చెందిన యువకుడు గల్ఫ్‌లోని బెహరాన్‌లో తనువుచాలించాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం తల్లిదండ్రులకు తెలియడంతో ‘ఎంత పనిజేస్తివిరా కొడుకా..’ అంటూ బోరున విలపించారు. గ్రామానికి చెందిన పిట్టల వెంకటి-లక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు నవీన్‌(25) ఉన్నారు. ఉపాధి కోసం నవీన్‌ ఇటీవల అప్పు చేసి బెహరాన్‌ వెళ్లి ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. నెలనెలా డబ్బులు ఇంటికి పంపించేవాడు. సోమవారం స్నేహితులకు ఫోన్‌చేసి తల్లిదండ్రుల బాగోగులు తెలుసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చివరి మాటలను తల్లిదండ్రులకు వినిపించాలని నవీన్‌ వారికి వాయిస్‌ మెసేజ్‌ పంపించాడు. ఈ విషయమై ఇక్కడి స్నేహితులు బెహరాన్‌లోని మిత్రులకు తెలుపగా వారు నవీన్‌ గదికి వెళ్లి చూడగా అతడు అప్పటికే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు దేశంకాని దేశంలో ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు విలపించిన తీరు చూసేవారిని కంటతడిపెట్టించింది.  


logo