ఆదివారం 31 మే 2020
Telangana - May 14, 2020 , 21:26:52

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

తిర్యాణి : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నేధరికి చెందిన నైతం జగదీశ్‌ తనతల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో  పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జగదీశ్‌ తండ్రి పొల్లు ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. 15 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందగా, 2011లో జగదీశ్‌కు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. నిత్యం మద్యం తాగి కార్యాలయానికి వస్తున్నాడని, మందలించి గిన్నేధరిలోని ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారు. 

అయినా తీరు మార్చుకోకపోవడంతో ఐదేళ్ల క్రితం సస్పెండ్‌ చేశారు. మరింత తాగుడుకు బానిసైన జగదీశ్‌ నిత్యం కుటుంబ సభ్యులను దూషించేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా తాగేందుకు రూ. 500 ఇవ్వాలని తన తల్లి రత్నుబాయిని అడుగగా, లేవని చెప్పింది. గొడవ సద్దుమనుగడం కోసం అతడి అక్క రూ. 300 ఇచ్చింది. దీంతో బయటకు వెళ్లి.. మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్లందరిని ఓ గదిలో బంధించి మరో గదిలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలు ఆర్పి అతడిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


logo