శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:39:07

వివాదాల వీకే సింగ్‌ బదిలీ

వివాదాల వీకే సింగ్‌ బదిలీ

  • డీజీపీ కార్యాలయంలో రిపోర్టుచేయాలని ఆదేశం
  • పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌కు అదనపు బాధ్యత
  • ఆద్యంతం వివాదం.. అనునిత్యం అసంతృప్తే!
  • సొంత ఎజెండా.. సెల్ఫ్‌ స్టయిల్‌ పని!.. అధికార పరిధి పట్టదు!
  • సహచర ఉద్యోగులే విస్తుపోయేలా సీనియర్‌ ఐపీఎస్‌ ధోరణి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోలీస్‌ శాఖలో అత్యంత వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకొన్న రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ వీకే సింగ్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. వీకే సింగ్‌ స్థానంలో రాష్ట్ర పోలీసు నియామకాల బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. 

ఆదినుంచీ అంతే!

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌ నిత్యం ఏదో ఒక వివాదంతో, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారని పోలీసువర్గాలే విమర్శిస్తున్నాయి. ఏ ప్రభుత్వమున్నా వ్యతిరేకించడం.. తన అధికార పరిధిని మించి సొంత ఎజెండాతో సెల్ఫ్‌ స్టయిల్‌గా పనిచేస్తుంటారని ఆయన సహచర ఉద్యోగులు విమర్శిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే వీకే ను బదిలీ చేసినట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. వీకేసీంగ్‌ నిత్య అసంతృప్తవాది అని, తనకు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని కూడా ఇటీవల కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన సహచరులు చెప్తున్నారు. తన ‘మార్క్‌' చేష్టలతో ఎవరికీ అంతుపట్టని ధోరణితో ఉంటారంటున్నారు. తానొక్కడే సమర్థుడని.. మిగిలిన వారంతా తక్కువవారన్నట్టుగా వ్యవహరిస్తారని పోలీసువర్గాలే విస్తుపోతున్నాయి. ఒక సివిల్‌ అధికారి స్థాయికి సరిపడని రీతిలో ఆయన వ్యవహారశైలి ఉంటుందని ఆరోపిస్తున్నారు. 

అతనికి ప్రచార కండూతి ఎక్కువని, దానితోనే వ్యవస్థలో లోపాలున్నాయంటూ గగ్గోలు పెడుతుంటారని పేర్కొంటున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా పోలీస్‌ ఉన్నతాధికారిగా పనిచేసిన వీకే సింగ్‌ ఒకానొక సందర్భంలో ‘పోలీస్‌ వ్యవస్థతో ప్రజలకు ఒరిగేదేమీలేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని సివిల్‌ సర్వీస్‌ అధికారులు విమర్శిస్తున్నారు.   ఆయన నవంబర్‌లో పదవీవిరమణ చేయాల్సి ఉండగా, అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ కోరుతూ దరఖాస్తుచేశారని,  నెలముం దు పదవీ విరమణ కోరుతున్న ఆయన ఎన్నో ఏండ్ల సర్వీసును వదులుకొంటున్నట్లుగా తెగ హడావుడి చేస్తున్నారంటున్నారు. రోజుకో పత్రికా ప్రకటనతో తనకేదో పోలీసు వ్యవస్థలో అన్యాయం జరిగిందని లేఖలు రాయడం విడ్డూరమని, రిటైర్మెంట్‌ నుంచి కూడా ప్రచార లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్నట్లు పోలీసువర్గాలే పేర్కొంటున్నాయి.

జైళ్లశాఖ డీజీగా లెక్కలేనన్ని వివాదాలు

వీకేసింగ్‌ తెలంగాణ జైళ్లశాఖ డీజీగా సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చర్లపల్లి జైలునుంచి టేకు కలపను బీహార్‌లోని పాట్నాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ టీవీ చానల్‌ కథనాన్ని ప్రసారంచేయడం అప్పట్లో కలకలం రేపింది. ఆ టీవీ చానల్‌పై వీకేసింగ్‌.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలని, ఆ టీవీ చానల్‌ ‘కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్‌' అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీనిపై జర్నలిస్టులు సైతం నిరసన వ్యక్తంచేశారు. వీకే సింగ్‌ బహిరంగ క్షమాపణ చెప్పేవరకు జైళ్లశాఖ వార్తలను కవర్‌ చేసేది లేదనేవరకు పరిస్థితి వెళ్లడం అప్పట్లో తమకు తలనొప్పిగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. 

అంతా వేస్ట్‌.. నేనే బెస్ట్‌

‘అన్ని వ్యవస్థలు నిరుపయోగమైనవి, నేను మాత్రమే వాటిని బాగు చేయగలను’ అన్న తరహాలో వీకేసింగ్‌ ధోరణి ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. తానొక్కడే నిబంధనలు పాటిస్తున్న ట్టు చెప్పుకొనే వీకేసింగ్‌కు ప్రచార ఆర్భాటాలు ఎక్కువేనని పోలీసువర్గాలే పేర్కొంటున్నాయి. ఏ చిన్న విషయమైనా మీడియాలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్న తాపత్రయం ఉండేదని చెప్తున్నాయి. జైళ్లశాఖనుంచి ప్రింటి ంగ్‌ అండ్‌ స్టేషనరీ డైరెక్టర్‌గా బదిలీచేస్తే.. ‘వ్యవస్థ బాగాలేదు. ప్రభుత్వానికి దీంతో ఉపయోగం లేదు. మొత్తం ప్రెస్‌ను మూసివేయాలి’ అంటూ అక్క డి సిబ్బంది, కార్మికుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించినట్టు సమాచారం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభు త్వం ఆయనకు పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా అవకాశం ఇస్తే.. బాధ్యతలు తీసుకున్న వెంటనే భార త పోలీసింగ్‌ వ్యవస్థే సక్రమంగాలేదని, శిక్షణ సంస్థలన్నీ నాణ్యతలేనివని వ్యాఖ్య లు చేశారు. ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ ఇవ్వడంలో ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉన్న మన జాతీయ పోలీస్‌ అకాడమీ సహా దేశంలోని అన్ని పోలీస్‌ అకాడమీలు వృథా అని కామెంట్లు చేసినట్టు పో లీసువర్గాలు చెప్తున్నాయి. పోలీస్‌ అకాడమీలు డంపింగ్‌యార్డులుగా మారాయని, బయట పనిలేని వాళ్లను ఇక్కడకు బదిలీచేస్తున్నారని వ్యాఖ్యలుచేశారని పేర్కొంటున్నాయి.

వీకే సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల్లో కొన్ని.. పోలీస్‌ వ్యవస్థతో ఒరిగేదేం లేదు ఆ టీవీ చానల్‌ కమర్షియల్‌ సెక్స్‌వర్కర్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ వ్యవస్థ వృథా ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ను మూసేయాలి పోలీసు అకాడమీలు డంపింగ్‌ యార్డులు

పోలీస్‌ అకాడమీలో 200 మందికి కరోనా!

వీకే సింగ్‌ తీరుతో తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో కరోనా విజృంభించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అకాడమీలో ఇప్పటివరకు దాదాపు 200 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. 150 మంది వరకు శిక్షణ ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు అకాడమీ సిబ్బందిలో 50 మందికి కరోనా సోకినట్టు అకాడమీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అకాడమీలో 1,250 మంది ఎస్సైలు, 650 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. అకాడమీ సిబ్బందితో కలిపి మొత్తం 2,200 మంది వరకు ఉంటారు. వీరందరికీ కరోనా పరీక్షలుచేయిస్తే మరో 300 నుంచి 400 మందికి పాజిటివ్‌గా తేలే అవకాశం ఉన్నట్టు అకాడమీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అకాడమీలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఓ ఐపీఎస్‌ అధికారితోపాటు ముగ్గురు అదనపు ఎస్పీలు, మరో ముగ్గురు డీఎస్పీలకు పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. 

కరోనా విజృంభిస్తున్నా అకాడమీ డైరెక్టర్‌ వీకేసింగ్‌ సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అకాడమీలో రెండు ఐసొలేషన్‌ సెంటర్లు పెట్టినా వాటిలో శాస్త్రీయంగా వైద్యం అందించడంలేదు. క్వారంటైన్‌ పేరిట కొన్ని గదులు ఏర్పాటుచేయించినా వారికి వసతులు కల్పించడంలేదని తెలిసింది. కరోనా కేసులపై అకాడమీ నుంచి వైద్యశాఖ, ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ట్రైనీల్లో కరోనా లక్షణాలు ఉన్నవారిని కూడా ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవాలని అకాడమీ డైరెక్టర్‌ సూచిస్తున్నారని, కేసులు పెరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కొందరు శిక్షణ ఎస్సైలు విమర్శిస్తున్నారు. తాము మానసికంగా ఆందోళనలో ఉన్నట్టు చెప్తున్నారు. వారం రోజుల్లో పరీక్షలు జరుగాల్సి ఉన్నదని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఉంటాయో లేదో కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మానసికంగా ఎంతో ఒత్తిడిలో ఉన్నట్టు వారు వాపోయారు.


logo