శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 31, 2020 , 02:26:09

సొమ్ముభద్రం.. సమస్య పరిష్కారం

సొమ్ముభద్రం.. సమస్య పరిష్కారం

  • రాష్ట్రంలో రీజినల్‌ ఎమ్మెస్‌ఈఎఫ్‌సీలు సక్సెస్‌
  •  2018లో నాలుగు ఏర్పాటు
  • వేల ఫిర్యాదులకు పరిష్కారం

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ‘కొన్నేండ్లుగా ఓ కంపెనీ ఉత్పత్తులను ఓ ట్రేడర్‌ షాపు నిర్వాహకుడు డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా కొనుగోలుచేసి వినియోగదారులకు అమ్ముతున్నాడు. డబ్బుల్లేవు క్రెడిట్‌పై ఇవ్వాలని ట్రేడర్‌ కోరగా.. కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌ రూ.5 లక్షల వరకు ఉత్పత్తులను సరఫరా చేశారు. ట్రేడర్‌ ఆ సొమ్మును తిరిగి చెల్లించలేదు. కంపెనీ నోటీసులు పం పినా స్పందించలేదు. ఇలాగే ఎంతోమంది ట్రేడర్స్‌ మోసం చేయడంతో ఆ డిస్ట్రిబ్యూటర్‌ అప్పుల్లో కూరుకుపోయాడు. రాష్ట్రస్థాయి కౌన్సిల్‌లో ఫిర్యాదుచేసినా.. ఇలాంటి మో సాలు అక్కడ వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలి సి తన నంబర్‌ కోసం ఎదురుచూస్తూ తలపట్టుకున్నాడు’ ఇదంతా 2018 జూలై ముం దు మాట. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ 2018 జూలైలో రాష్ట్రస్థాయి కౌన్సిల్‌ అధికారాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాలను కలుపుతూ కొత్తగా నాలుగు ‘మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిల్స్‌ (ఎమ్మెస్‌ఈఎఫ్‌సీ)’ను ఏర్పాటుచేశారు. దీంతో పరిస్థితి మారిపోయింది. మోసపోయిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతున్నా యి. ప్రభుత్వ సంకల్పం ఫలిస్తున్నది. 

నలుదిక్కులా నాలుగు కౌన్సిళ్లు

రాష్ట్రంలోని 31 జిల్లాలను కలుపుతూ నలుదిక్కుల మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాకేంద్రాలను రీజనల్‌ కౌన్సిల్‌ కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. వీటికి ఆయా జిల్లాల పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్లు కౌన్సిల్‌ చైర్మన్లుగా వ్యవహరిస్తారు.  

ఆన్‌లైన్‌లో కౌన్సిల్‌కు ఫిర్యాదు

ట్రేడర్స్‌ వద్ద, డిస్ట్రిబ్యూటర్‌ వద్ద సర్వీస్‌పరంగా నష్టపోయినవారు.. ఆధారాలను జతచేస్తూ ఎంఎస్‌ఈఎఫ్‌సీ కౌన్సిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా చైర్మన్‌కు ఫిర్యాదుచేయాలి. వాటి కాపీలను చైర్మన్‌ కార్యాలయానికి పంపాలి. ఫిర్యాదును పరిశీలించాక కౌన్సిల్‌ ఎదుట హాజరుకావాల్సిందిగా నష్టపోయిన వ్యక్తికి, డబ్బు చెల్లించాల్సిన వ్యక్తికి నోటీసులు జారీచేస్తారు. ఇరువురితో మాట్లాడినా ఒక అంగీకారానికి రా కుంటే.. విచారణ కోసం తేదీలను ప్రకటిం చి అవార్డు (ఆర్బీఐ నియమావళిని అనుసరించి వడ్డీతో సహా చెల్లించాలని) ప్రకటిస్తారు.

75 శాతం డిపాజిట్‌ చేయాల్సిందే

కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రకటించిన అవార్డుకు వ్య తిరేకంగా కోర్టుకు పోవాలంటే.. అవార్డులోని 75 శాతం సొమ్మును డిపాజిట్‌ చేశాకే పిటిషన్‌ దాఖలుచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ పిటిషన్‌ను కోర్టు స్వీకరించదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 3 వేల వరకు కేసులు పరిష్కారమయ్యాయని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. అత్యధిక పరిశ్రమలున్న మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలో వందల సంఖ్య లో కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు.  రీజినల్‌ కౌన్సిల్‌ ఏర్పాటుతో ఎన్నో ఏండ్ల సమస్యలకు మోక్షం లభిస్తున్నదని ఆ జిల్లా పరిశ్రమలశాఖ జీఎం రవీందర్‌ తెలిపారు. 


logo