మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:06

పంప్‌హౌజ్‌ల నిర్వహణ జెన్‌కోకు

పంప్‌హౌజ్‌ల నిర్వహణ జెన్‌కోకు

  • ఏఎమ్మార్పీ బాటలోనే అన్ని ఎత్తిపోతలు
  • సబ్‌స్టేషన్లు, పంప్‌హౌజ్‌ల కరెంటు సరఫరా ట్రాన్స్‌కోకు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎత్తిపోతల పథకాల పరిధిలోని పంప్‌హౌజ్‌ల బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఏజెన్సీల గడువు తీరాక పంప్‌హౌజ్‌ల నిర్వహణ బాధ్యతలను ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు తరహాలో జెన్‌కోకు అప్పగించనున్నారు. కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో అత్యధికం ఎత్తిపోతల పథకాలే ఉన్నాయి. గోదావరిపై అలీసాగర్‌, గుత్ప, దేవాదుల.. కృష్ణాపై భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ హైలెవల్‌, లోలెవల్‌ తదితర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. గతేడాది అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులోనూ ఇప్పటికి పది పంపుహౌజ్‌లు నడుస్తున్నాయి. భవిష్యత్‌లోనూ మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. వాస్తవంగా ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యాక రెండేండ్లపాటు నిర్మాణ ఏజెన్సీలే నిర్వహణను చూస్తాయి. తర్వాత జల వనరులశాఖ ఆధీనంలోకి వస్తాయి. అప్పట్నుంచి అధికారులు ప్రతి ఏడాది వాటినిర్వహణకు టెండర్లు పిలిచి, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు.

తొలిసారిగా ఏఎమ్మార్‌ ప్రాజెక్టులో

నల్లగొండ జిల్లాలోని ఏఎమ్మార్పీ పంపుహౌజ్‌ల నిర్వహణ మొదట్నుంచి జెన్‌కో ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. ఈ తరహాలోనే అన్ని ఎత్తిపోతల పథకాల నిర్వహణను జెన్‌కోకే అప్పగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. నిర్వహణ గడువు పూర్తయిన పంపుహౌజ్‌లు ఒక్కొక్కటిగా జెన్‌కో ఆధ్వర్యంలోకి వెళ్లనున్నాయి. అదేవిధంగా ఎత్తిపోతల పథకాల్లోని సబ్‌స్టేషన్లతోపాటు పంప్‌హౌజ్‌ల దాకావచ్చే కరెంటు సరఫరా వ్యవస్థలను ఇకనుంచి ట్రాన్స్‌కో నిర్వహిస్తుందని ప్రభుత్వం మరో కీలకనిర్ణయం కూడా తీసుకున్నది.logo