కరీంనగర్ కమాన్చౌరస్తా, నవంబర్ 11 : శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులను అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా, కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకు గానూ దాదాపు 40 మందిని అధికారులు పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. అయితే, ఇంటర్నల్ పరీక్ష సమాచారం విద్యార్థులకు అంతర్గతంగా సమాచారం ఇవ్వగా, పరీక్ష రాసేందుకు విద్యార్థులు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకున్నారు. కాగా, హాజరు తక్కువ ఉన్న విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వవద్దని ముందే నిర్ణయం తీసుకున్న యూనివర్సిటీ అధికారులు, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హాజరు తక్కువ ఉన్న విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. తక్కువ హాజరు ఉన్నా ఎల్ఎల్బీ ఇంటర్నల్ పరీక్ష రాయవచ్చని గతంతో హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయని వివరించారు.
దీంతో తమకు ఆ నిబంధనలు వర్తించవని, తాము నిర్ణయించిందే ఫైనల్ అంటూ అధికారులు సమాధానం చెప్పారు. అయితే, తమతో బయోమెట్రిక్ హాజరు ఎందుకు వేయించుకున్నారని విద్యార్థులు అధికారులను ప్రశ్నించగా, వారు తమతో మాట్లాడవద్దని, పోలీసులతో విద్యార్థులను పరీక్ష కేంద్రం బయటకు పంపించారు. ఈ విషయంలో విద్యార్థులు మాట్లాడుతూ, ఎల్ఎల్బీ చేసే విద్యార్థులు కనీస హాజరు శాతం లేకున్నా పరీక్ష రాసే అవకాశం ఉంటుందని, అవేవీ పట్టకుండా అధికారులు తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే, తమకు అటెండెన్స్ లేదని పరీక్ష రాయకుండా ఆపిన అధికారులు, అదే పైరవీలతో వచ్చిన పలువురు విద్యార్థులకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా, విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా ఉన్నదని, బీసీఏ గైడ్లైన్స్ ప్రకారం 75 శాతం హాజరు తప్పనిసరి అని తెలిపారు. అలాగే, హైకోర్టు ఉత్తర్వుల విషయం ప్రస్తావించగా, ఆ విషయంలో యూనివర్సిటీలో అలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీలో లా చదువుతున్న 50 విద్యార్థులకు అటెండెన్స్ లేదని ఇంటర్నల్ పరీక్ష రాయనివ్వకుండా బయట నిలబెట్టడం సరికాదు. కనీసం లా విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించలేని పరిస్థితిలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. వసతి లేకుండా ఏ విధంగా విద్యార్థులు రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంటుంది. అడ్మిషన్ సందర్భంలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి ఇప్పుడు లేదని చెప్పడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ విషయంలో విద్యార్థులు ప్రశ్నిస్తే రిజిస్ట్రార్ వచ్చి విద్యార్థులపై వ్యక్తిగతంగా మాట్లాడడం కక్షపూరితమే. అటెండెన్స్ లేదని పేరుతో లోనికి రానివ్వకపోవడం సరైంది కాదు. వీటికి బార్ కౌన్సిల్లో ఎలాంటి నిబంధనలు లేవు. అయినా శాతవాహన యూనివర్సిటీ అధికారులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. లా విద్యార్థులకు యూనివర్సిటీలో హాస్టల్ వసతి కల్పించాలి, అదేవిధంగా మొదటి ఇంటర్నల్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలి.