గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:13:30

జైళ్లలో చదువులు

జైళ్లలో చదువులు

పీవీ నరసింహారావు తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు న్యాయశాఖ, జైళ్లు, సమాచార, పౌర సంబంధాల శాఖలను అప్పగించారు. అంతగా ప్రాధాన్యం లేని శాఖలని చాలామంది అనుకొనేవారు. కానీ, తన సంస్కరణలతో జైళ్ల శాఖ రూపురేఖలనే మార్చారాయన. గ్రంథాలయాలు నెలకొల్పారు, సెంట్రల్‌ జైళ్లలో ఒక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జైళ్లకు కొత్త అర్థాన్ని, రూపును ఇచ్చారు. ‘అంబర్‌ చరఖా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆజంజాహీ మిల్లు కార్మికుల సహాయంతో నేరస్థులకు మగ్గం పని, జంపుఖానాల తయారీలో శిక్షణ ఇప్పించారు. నేరస్థులు నాలుగ్గోడల మధ్య బంధించే విధానానికి స్వస్తి పలికారు.

ఓపెన్‌ ఎయిర్‌ జైలు విధానానికి తెరతీశారు. తొలుత దీనిని మౌలాలి దగ్గరనున్న చర్లపల్లి జైలులో అమలు చేశారు. జైల్లో కాకుండా ఆరుబయట ఉంచుతూ, వారితో వ్యవసాయం సంబంధిత పనులను చేయించారు. వాళ్లను సత్ప్రవర్తన కలిగిన వారుగా తీర్చిదిద్దేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడింది. జైళ్లలో ఉన్న మహిళల రక్షణ కోసం మహిళా అధికారులను నియమించే విధానాన్ని ప్రవేశపెట్టారు. పీవీ నరసింహారావు ఒక్క నేరస్థుల సంక్షేమం కోసమే కాదు జైలు సిబ్బంది బాగోగుల కోసం అనేక చర్యలను చేపట్టారు. వారి వేతనాలను సవరించడమేగాక, అనేక వసతులను కల్పించారు. నాడు పీవీ తీసుకున్న నిర్ణయాలతో జైళ్లశాఖ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ తర్వాత పీవీ ఆశయాలను కొనసాగించిన ప్రభుత్వాలు మరిన్ని సంస్కరణలను అమలు చేశాయి. ఫలితంగా వేలాది మంది ఖైదీలు డిగ్రీ పట్టాలను పొందారు.


logo