శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 00:44:04

సర్కారు కాలేజీలకే జై

సర్కారు కాలేజీలకే జై

  • ఐసెట్‌ సీట్ల కేటాయింపులు పూర్తి
  • ఎంబీఏలోనే చేరిన అత్యధికులు 
  • ప్రైవేటుపై ఆసక్తి చూపని విద్యార్థులు
  • రెండు కాలేజీల్లో అడ్మిషన్లు నిల్‌ 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఐసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే అడ్మిషన్లు పొందారు. కోర్సుల వారీగా చూస్తే ఎంసీఏ కన్నా ఎంబీఏకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రెండు కళాశాలలకు ఒక్క అడ్మిషన్‌ కూడా రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంసీఏ సీట్లు వందశాతం నిండగా .. ఎంబీఏలో 91.9% మంది అడ్మిషన్లు పొందారు. ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏలో 66.8%, ఎంసీఏలో 98.6% సీట్లు భర్తీ అయ్యాయి. ఐసెట్‌లో 41,512 మంది అర్హత సాధించగా, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు 19,545 మంది హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కలుపుకుని మొత్తంగా 279 కాలేజీల్లో 24,690 సీట్లుండగా, వాటిలో 17,421 సీట్లు భర్తీకాగా, 7,269 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాలేజీల పరంగా తీసుకుంటే 104 కాలేజీల్లో 100శాతం సీట్లు భర్తీకాగా, 2 కాలేజీల్లో ఒక్కరు కూడా చేరకపోవడం విశేషం.

 సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

సీట్లు పొందిన విద్యార్థులంతా అలాట్‌మెంట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని, ఈ నెల 29లోగా డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్‌బ్యాంకింగ్‌ల ద్వారా ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని ఐసెట్‌ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. ఈ నెల 29లోగా www. tsicet.nic.in వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని వివరించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని వారి సీట్లు ఆటోమెటిక్‌గా రద్దవుతాయని పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థి విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఒక సెట్‌, బదిలీపత్రం(టీసీ) ఒరిజినల్‌ను విధిగా సంబంధిత కాలేజీలో అందజేయాలని సూచించారు. వద్దనుకొనే వారు వెబ్‌సైట్‌లో సీటును క్యాన్సిల్‌ చేసుకొనే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.