మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 06:40:44

చిన్నారులు ఉన్నత విద్యపై మక్కువ పెంపొందించుకోవాలి : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి

చిన్నారులు ఉన్నత విద్యపై మక్కువ పెంపొందించుకోవాలి : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి

హైదరాబాద్ : చిన్నారులు ఉన్నత విద్యపై మక్కువ పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఓఎస్డీ, ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి సూచించారు. చిన్నారుల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల గురించి వారికి వివరించాలన్నారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సతీమణి పేరిట సీఎల్‌బీ అవార్డు కౌన్సిల్‌ ఏర్పాటు చేసి, ప్రతిఏటా సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్రపాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయం అనేది నిరంతర ప్రక్రియ ద్వారా చేకూరుతుందన్నారు. విజయం అనేక రూపాల్లో ఉంటుందని, అనేక నిర్వచనాలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉంటే కఠినతరమైన అంశాలు కూడా సులువుగా గుర్తుండిపోతాయని ఆమ్రపాలి అన్నారు.

ప్రాథమిక స్థాయి నుంచి ఐఐటీపై అవగాహన పెంచుకోవడంతో ఐఐటీ సీటును సులభంగా పొందవచ్చని వివరించారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ..  రాష్ట్రంలో కూడా ఉన్నత విద్యాతో పాటు స్కూల్‌ విద్య కూడా ఉన్నతంగా కొనసాగుతున్నదని అభిప్రాయపడ్డారు. సీఎల్‌బీ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థినీ, విద్యార్థులకు వారు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్‌బీ అవార్డు కమిటీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, అధ్యక్షుడు డాక్టర్‌ సీఎన్‌ రెడ్డి, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ ఎం.జానకీ ప్రభాకర్‌, సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ధ్రువ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, నానో ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ వై.శ్రీనివాస్‌, ఇందిరా ప్రియదర్శిని అవార్డు విజేత నరేశ్‌చంద్ర, వందేమాతరం ఫౌండేషన్‌ ప్రతినిధి వందేమాతరం రవీందర్‌, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


logo