గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 07:55:30

ఒకే చోట విద్యార్థులు గుమిగూడొద్దు

ఒకే చోట విద్యార్థులు గుమిగూడొద్దు

హైదరాబాద్‌: పదోతరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలకు మాస్క్‌లతో విద్యార్థులు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నారు.అయితే విద్యార్థులు ఒకే చోట గుమిగూడరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు పరీక్షలు జరుగనుండగా, జిల్లాలో 362 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 82,502 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. 

ఆలస్యం ఐదు నిమిషాలే..

ఎస్సెస్సీ విద్యార్థులు  పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వెళితే విద్యాసంవత్సరం కోల్పోయినట్లే.. కేవలం 5 నిమిషాలు ఆలస్యంగా మాత్రమే అనుమతిస్తారు. ఐదు నిమిషాల దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించమని విద్యాశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే కాస్త జాగ్రత్త వహించి.. ముందుగా బయలుదేరి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా, ఒక్క సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9: 30 గంటల నుంచి 12 : 45 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు.  

వెబ్‌సైట్‌ హాల్‌టికెట్లకు అనుమతి..

విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి పొందిన హాల్‌టికెట్లతో పరీక్షా కేంద్రంలోపలికి అనుమతిస్తామని డీఈవో తెలిపారు. హాల్‌టికెట్‌ అందకపోయినా.. యాజమాన్యాలు హాల్‌టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించినా విద్యార్థులు WWW.bsetelangana.com వెబ్‌సైట్‌లో సంప్రదించి హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. ఆయా హాల్‌టికెట్లపై ఫొటో, హెడ్‌మాస్టర్లు, గెజిటెడ్‌ అధికారులచే సంతకాలు చేయించాలని సూచించారు.  

144 సెక్షన్‌, జిరాక్స్‌ సెంటర్ల మూసివేత 

పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని డీఈవో తెలిపారు. తల్లిదండ్రులు, ఇతరులెవ్వరైనా పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండరాదన్నారు. పోలీసు సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద భధ్రతను పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు అత్యంత సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీచేశామన్నారు.

హెల్ప్‌లైన్‌..ఏర్పాటు

విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసేందుకు 040 -29701474 అనే నంబర్‌తో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు. అంతేకాకుండా ఏవైనా అక్రమాలు జరిగినా, కాపీయింగ్‌ను ప్రొత్సహిస్తున్నట్లుగా సమాచారమున్నా..ఈ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 

పదోతరగతి పరీక్షలకు ప్రత్యేక బస్సులు

పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్‌ ఈడీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం నుంచి పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల మీదుగా బస్సులు నడుపుతామని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి మానిటరింగ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


logo