శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 16:48:32

శెభాష్ సుహ‌ర్ష‌.. యువతకు నువ్‌ ఆదర్శం: మాజీ ఎంపీ క‌విత‌

శెభాష్ సుహ‌ర్ష‌.. యువతకు నువ్‌ ఆదర్శం: మాజీ ఎంపీ క‌విత‌

హైద‌రాబాద్ : తెలంగాణ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన మంచిర్యాల పట్టణానికి చెందిన సుహర్షను కవిత అభినందించారు. సుహర్షను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. విద్యార్థినికి అన్ని రకాలుగా స‌హాయ‌, సహకారాలు అందిస్తామన్నారు.  ఈ సందర్భంగా సుహర్ష ,ఆమె తల్లిదండ్రులతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. కుటుంబ, వ్యక్తిగత వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుహర్ష యువ‌త‌కు ఆద‌ర్శం అని తెలిపిన క‌విత ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. 

మంచిర్యాల టు అలబామ..

మంచిర్యాలకు చెందిన సుహర్ష హైదరాబాద్ శివారు ములుగు లోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు పూర్తి చేసారు. ఫారెస్ట్  యూనివర్సిటీ, అబర్న్ యూనివర్సిటీ మధ్య జరిగిన ఎంఓయూ మేరకు ప్రస్తుతం అమెరికాలోని  అబర్న్ యూనివర్సిటీలో సుహర్ష ఎంఎస్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) లో సీటు సాధించారు. అంతేకాక, యూనివర్సిటీ నుండి రూ. 50 లక్షల ఉపకారవేతనం, ట్యూషన్ ఫీజు మినహాయింపు పొందారు. 

జ్ఞాపకాలు నెమరువేసుకున్న మాజీ ఎంపీ కవిత

ఈ సందర్భంగా తాను అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన జ్ఞాపకాలను సుహర్షతో క‌విత‌ పంచుకున్నారు. మిసిసిప్పిలో ఎంఎస్ చదివిన‌ట్లు ఆ స‌మ‌యంలో 500 డాలర్లు స్కాల‌ర్‌షిప్ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం సుహర్ష సీటు సాధించిన అలబామా పక్కనే ఉన్న మిసిసిప్పి నగరంలోనే నివ‌సించిన‌ట్లు చెప్పారు. అక్కడి పరిస్థితులను విద్యార్థినితో పంచుకున్నారు.

కవితక్క అంటే ఎనలేని అభిమానం

వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సుహ‌ర్ష‌ మాట్లాడుతూ తాను కవితక్కకు పెద్ద అభిమానిన‌ని అన్నారు. కవితక్క పలుమార్లు మంచిర్యాల ప్రాంతంలో పర్యటించినప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించినా అవకాశం దొరకలేదంది. ఇప్పుడు స్వయంగా కవితక్కే ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందంగా ఉందంది. అభిమాన నాయకురాలు స్వయంగా ఫోన్ చేసి అభినందించడం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్న సుహర్ష.. భవిష్యత్తులో స్వరాష్ట్రానికి సేవలు అందిస్తానని తెలిపారు. త‌న‌కు ఈ అవ‌కాశం రావ‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్, అటవీ‌శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీన్ చంద్రశేఖర్ రెడ్డికి సుహ‌ర్ష ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.  



logo