e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ట్రెండింగ్‌ హెల్ప్‌లైన్లతో విద్యార్థులకు సాంత్వన

హెల్ప్‌లైన్లతో విద్యార్థులకు సాంత్వన

హెల్ప్‌లైన్లతో విద్యార్థులకు సాంత్వన

భవిష్యత్తుపై ధైర్యం నింపుతున్న మానసిక నిపుణులు

సార్‌.. కొవిడ్‌తో మా అమ్మ, అత్తమ్మ చనిపోయారు. రోజూ ఏడుస్తూ కూర్చుంటున్నా. మనసు కుదురుగా ఉండటంలేదు. ఏం చేయమంటారు ? అంటూ భోరున విలపిస్తున్న ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. ఆ సమస్యలను సావధానంగా విన్న ఓ సైకాలజిస్ట్‌ ఆ విద్యార్థినిలో ధైర్యాన్ని నింపారు. ‘కొవిడ్‌ వస్తే అందరూ చనిపోరు. ఆరోగ్యం విషయమించడం వల్ల కొందరు మాత్రమే చనిపోతున్నారు. 95 శాతం మంది రోగులు కోలుకొంటున్నారు. నువ్వు ఏం కావాలని మీ అమ్మగారు కోరుకున్నారో ఆ స్థానానికి ఎదిగితేనే ఆమె ఆత్మ సంతోషిస్తుంది. కనుక ఆ దిశగా నీవు ముందుకు సాగాలి’ అంటూ ప్రేరణనిచ్చే ప్రయత్నంచేశారు. ఇలా విద్యార్థుల్లోని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు ఇంటర్‌ బోర్డు హెల్ప్‌లైన్లు ఎంతో దోహదపడుతున్నాయి.
-హైదరాబాద్‌, జూన్‌ 8 (నమస్తే తెలంగాణ )

విద్యార్థులు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఇవీ..

  • పరీక్షలు రద్దు చేయడంతో అంతా పాసవుతున్నా రు. అసలు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయా? జరుగకపోతే మార్కులెలా వేస్తారు? ఎంసెట్‌లో వెయిటేజీ ఉంటుందా? ప్రవేశ పరీక్షలు జరుగుతాయా? ఇప్రూవ్‌మెంట్‌ రాసుకోవచ్చా?
  • కరోనాతో భయమేస్తున్నది. కొవిడ్‌ వస్తే ఏం చేయాలి? వెంటనే దవాఖానకు వెళ్లాలా? ఇంట్లోనే చికిత్స తీసుకోవడం మంచిదేనా ?
  • కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా? టీకా వేసుకుంటే కరోనా రాదా? ఏ వ్యాక్సిన్‌ వేసుకోమంటారు?
  • ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకోవడం ఎలా? మా ఫీజులు ఎవరు కడతారు? పుస్తకాలు ఎవరిస్తారు?

7 హెల్ప్‌లైన్‌ నంబర్లు
కరోనా.. ఇంటర్‌ విద్యార్థుల్లో కొత్త భయాలు, ఆందోళనలకు దారితీస్తున్నది. దీంతో వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను పరిష్కరించేందుకు ఇంటర్‌ బోర్డు 7 హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేసి ఒక సైకియాట్రిస్ట్‌తోపాటు, ఆరుగురు క్లినికల్‌ సైకాలజిస్టులను నియమించింది. ఈ హెల్ప్‌లైన్లకు రోజూ 30-40 కాల్స్‌ వస్తున్నాయి. నెలక్రితం వరకు రోజూ 50 వరకు కాల్స్‌ రాగా.. ప్రస్తుతం వాటి సంఖ్య కాస్త తగ్గింది.

పరీక్షలు, మార్కులపై గందరగోళం
ఇలాంటి కాల్స్‌ చేసేవారంతా తమ భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. భవితకు ఇంటర్‌ విద్య పునాది కావడంతో పరీక్షలు, మార్కులపై కలవరపడుతున్నారు. పరీక్షలు నిర్వహించకుండా వేసే మార్కులు సంతృప్తికరంగా ఉంటాయా? ఉండవా? అన్న ప్రశ్నలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఎంసెట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తున్నది. కుటుంబాలకు కుటుంబాలే కొవిడ్‌ బారిన పడుతుండటం, కుటుంబసభ్యులు మరణిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన అధికమవుతున్నది. ఇలాంటివారిలో చాలా మంది ఇంటర్‌ బోర్డు హెల్ప్‌లైన్లను ఆశ్రయించి తమ సమస్యలకు పరిష్కారాలను కోరుతున్నారు. వ్యాక్సిన్ల గురించి కూడా ఆరా తీస్తున్నారు. తమకు ఫీజులు, పుస్తకాలు సమకూర్చే ఏర్పాటుచేయాలని పేద విద్యార్థులు విజ్ఞప్తిచేస్తున్నారు.

ఆలోచనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు
భరోసా కల్పించే మనిషి అకస్మాత్తుగా చనిపోవడంతో చాలామంది పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆప్తుల మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులే ఎక్కువగా మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. వారిలో బాధను దూరంచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక్కో విద్యార్థికి కనీసం 20 నిమిషాలపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలంటూ ప్రేరణ ఇస్తున్నాం.

జవహర్‌లాల్‌ నెహ్రూ, పిల్లల మానసిక వైద్యనిపుణుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెల్ప్‌లైన్లతో విద్యార్థులకు సాంత్వన

ట్రెండింగ్‌

Advertisement