సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 11:24:31

మాస్కులతో పరీక్షలకు హాజరైన టెన్త్‌ విద్యార్థులు..

మాస్కులతో పరీక్షలకు హాజరైన టెన్త్‌ విద్యార్థులు..

హైదరాబాద్‌: కరోనా భయం ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. 

కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిద్‌-19) పాజిటివ్‌ కేసులు అధికమవుతుండడంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఇవాళ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం విదితమే. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. వారికి తల్లిదండ్రులు కూడా బాసటగా నిలుస్తూ.. పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి, భరోసానిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు శానిటైజర్లు, నీళ్ల బాటిల్స్‌ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.


వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అయితే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఆ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ బిడ్డలకు కరోనా సోకొద్దనే ఉద్దేశంతో వారికి పలు సూచనలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సెంటర్ల వద్ద మాస్కులతో విద్యార్థులు దర్శనమిస్తున్నారు. విద్యార్థులకు దగ్గరుండి వారి తల్లిదండ్రులు మాస్కులు కట్టి సెంటర్‌ లోపలికి పంపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులైతే తమ చేతులను శుభ్రంగా కడుక్కొని పరీక్షలకు హాజరవుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు అన్ని విధాలా అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇన్విజిలేటర్లు కూడా మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు.


logo