మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 03:18:56

ఏడేండ్ల జైలు

ఏడేండ్ల జైలు

  • వైద్యసిబ్బందిపై దాడిచేస్తే కఠిన శిక్షలు 
  • అంటువ్యాధుల నివారణ చట్టసవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం 

న్యూఢిలీ, సెప్టెంబర్‌ 19: వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడేవారికి ఇక కఠిన శిక్షలు పడనున్నాయి. ‘అంటువ్యాధుల చట్ట సవరణ బిల్లు-2020’కు రాజ్యసభ శనివారం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై దేశంలో వైద్యులపై జరిగే దాడులను బెయిలు ఇవ్వటానికి వీలులేని నేరాలుగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే ఏడేండ్ల వరకు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. కరోనా విస్తరణ కాలంలో దేశంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగటంతో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ తెచ్చింది. ప్రస్తుతం దీనిస్థానంలో తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభలో వాడివేడి చర్చ అనంతరం ఆమోదం లభించింది. 

ప్రతిపక్షాల ఫైర్‌

కరోనా, లాక్‌డౌన్‌, వలస కూలీలు, ప్రైవేటు దవాఖానల దోపిడీపై రాజ్యసభలో శనివారం తీవ్ర దుమారం రేగింది. ‘అంటువ్యాధుల చట్ట సవరణ బిల్లు-2020’పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నదని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రియన్‌ విమర్శించారు. ప్రపంచంలో మూడు ప్రజాస్వామ్య దేశాల్లో ప్రస్తుతం ఆర్డినెన్స్‌ ప్రభుత్వాలు నడుస్తున్నాయని, అవి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌ అని పేర్కొన్నారు. 

లోక్‌సభలో మూడు కార్మిక బిల్లులు

కార్మికులకు సంబంధించిన మూడు బిల్లులను శనివారం లోక్‌సభలో కార్మికశాఖ మంత్రి సంతోశ్‌కుమార్‌ గంగ్వార్‌ ప్రవేశపెట్టారు. దేశంలోని 29 కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్‌ కోడ్లుగా మార్చామని చెప్పారు. వాటిలో ఒకటైన ది కోడ్‌ ఆన్‌ వేజెస్‌ బిల్‌-2019ను గతేడాది పార్లమెంటు ఆమోదించింది. 

చైనాతోనేనా చర్చలు.. పాక్‌తో ఎందుకొద్దు: ఫరూక్‌ 

సరిహద్దు వివాద పరిష్కారానికి చైనాతో చర్చలు జరుపుతున్న కేంద్రప్రభుత్వం పాకిస్థాన్‌తో చర్చలకు ఎందుకు ముందుకు రావటంలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. సుదీర్ఘ గృహనిర్బంధం తర్వాత ఇటీవల విడుదలైన ఆయన మొదటిసారి శనివారం లోక్‌సభలో ప్రసంగించారు. ‘సరిహద్దుల్లో ఘర్షణలు పెరుగుతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. దీనికి పరిష్కారం కనుగొనాలి’ అని పేర్కొన్నారు.

ఆర్డినెన్స్‌రాజ్‌ సర్కార్‌

‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వారియర్స్‌గా ముందుండి వైద్య సేవలందిస్తున్న అందరికీ హ్యాట్సాఫ్‌' అని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ‘ఆర్డినెన్స్‌రాజ్‌ సర్కార్‌'గా ఆయన అభివర్ణించారు. రాష్ర్టాల వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదని మండిపడ్డారు. రాష్ర్టాల అధికార పరిధిలోకి వచ్చే అంశాలపై చట్టాలు చేసే ముందు ఆయా రాష్ర్టాలను కేంద్రం తప్పక సంప్రదించాలని సూచించారు. కరోనా కట్టడికోసమంటూ రాష్ర్టాలకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని విమర్శించారు. 


logo