ఆదివారం 31 మే 2020
Telangana - May 22, 2020 , 16:40:55

దోషులపై కఠిన చర్యలు : మంత్రి సత్యవతి

దోషులపై కఠిన చర్యలు : మంత్రి సత్యవతి

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌లోని గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన తొమ్మిదిమంది మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 9 మంది వలస కార్మికులు చనిపోవడం చాలా దురదృష్టకరమన్నారు. వీరి మృతిపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజానిజాలు తెలుస్తాయన్నారు.

ఈ రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు కూడా భాగస్వాములేనన్నారు. వారిని అన్ని విధాల ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. మృతదేహాల అప్పగింతకు అన్ని విధాల సహకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మంత్రి వ్యక్తిగతంగా రూ. లక్ష సాయంగా ప్రకటించారు. అదేవిధంగా దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపనేని నరేందర్‌ చెరో రూ. 50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.logo