శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 00:30:05

మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యూహం

మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యూహం

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
  • టీఆర్‌ఎస్‌లో చేరిన హైకోర్టు న్యాయవాదులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రశాంత హైదరాబాద్‌లో కొన్ని పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యూహాలు పన్నుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. అటువంటి పార్టీల ఆగడాలకు అవకాశం ఇవ్వొద్దని, అరాచకాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్లు బైరపాక జయకర్‌, ఎంఏ ముఖీద్‌, గండ్ర మోహన్‌రావు నేతృత్వంలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది అయ్యాడపు రవీందర్‌రెడ్డి సహా హైకోర్టు న్యాయవాదులు భారీఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలు పాటించే పార్టీల వ్యవహార తీరును ప్రజలకు వివరించి, వారిని చైతన్యపర్చడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని కోరారు. 

ఎల్‌ఐసీని అమ్మడమే దేశభక్తా!

ప్రధాని మోదీకి విశాలమైన ఛాతి ఉన్నది కానీ, విశాలమైన హృదయం లేదని వినోద్‌కుమార్‌ అన్నారు. ఒకవేళ ఉంటే దేశ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఎల్‌ఐసీ వంటి సంస్థల్ని అమ్మకానికి పెట్టరని పేర్కొన్నారు. ఎల్‌ఐసీని అమ్మడమే దేశభక్తా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పనిచేసే నిజమైన దేశభక్తి గల పార్టీ టీఆర్‌ఎస్‌ అని చెప్పారు. రిలయన్స్‌ జియో ప్రయోజనాల కోసమే బీఎస్‌ఎన్‌ఎల్‌ను చంపేస్తూ.. బీజేపీ పాలకులు ప్రగతి నిరోధక, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు.