శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 19:00:53

నాలాల అభివృద్ధికి వ్యూహాత్మక కార్యక్రమం : మంత్రి కేటీఆర్‌

నాలాల అభివృద్ధికి వ్యూహాత్మక కార్యక్రమం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో నాలాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాత్మక కార్యక్రమం తీసుకురాబోతున్నామని ఐటీ, పురపాలిక శాఖల మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో భారీ వరదలు వచ్చినా ముంపును అరికట్టేలా నాలాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాలాల వ్యూహాత్మక అభివృద్ధికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక విభాగం నాలాలు, డ్రైనేజీలను అధ్యయనం చేసి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

పురపాలక. వైద్య ఆరోగ్య, సాగునీటిశాఖల అధికారులు పనులను పర్యవేక్షిస్తారు. నాలాలపై ఆక్రమణల తొలగింపు బాధ్యతలను కూడా ప్రత్యేక విభాగానికే అప్పగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలోని చాలా నాలాలు ఆక్రమణకు గురవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవం పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నాలాలపై అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేసిన విషయం తెలిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.