శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 01:54:03

సీమ ఎత్తిపోతలను ఆపండి

సీమ ఎత్తిపోతలను ఆపండి

  • ఏపీకి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలు
  • ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి
  • కేఆర్‌ఎంబీకి డీపీఆర్‌ ఇచ్చాకే ముందుకెళ్లాలి
  • ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తుది ఉత్తర్వులు

ఎన్జీటీ నియమించిన కమిటీ నివేదికలో తెలంగాణ ఎత్తిచూపిన లోపభూయిష్టమైన సాంకేతిక అంశాలనే ట్రిబ్యునల్‌ కూడా తప్పుపట్టింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కమిటీ అభిప్రాయంతో విభేదించిన ఎన్జీటీ.. అనుమతులు తీసుకోవాల్సిందేనని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను వెంటనే నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కృష్ణా బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడంతోపాటు పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టుపై ముందుకుపోవాలని స్పష్టంచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ కే రామకృష్ణన్‌ నేతృత్వంలోని బెంచ్‌ గురువారం తుది ఆదేశాలను వెలువరించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డీపీఆర్‌లను పరిశీలించాక అనుమతులపై కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నది. రాయలసీమ ఎత్తిపోతలలో నీటిపారుదల ప్రయోజనాలు కూడా ఉన్నందున పర్యావరణ అనుమతి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. పై ఆదేశాలతో విచారణ ముగిసిందని పేర్కొన్నది. 

ఈసీ అవసరం లేదటం తప్పు

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదన్న నిపుణుల కమిటీ నివేదికతో ఎన్జీటీ విభేదించింది. కరువు ప్రాంతమైన రాయలసీమ తాగునీటి అవసరాలకు విస్తరిస్తున్నట్టు చెప్తున్నా.. పలు అంశాలను పరిశీలిస్తే సాగునీటి ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్టు అర్థమవుతున్నదని తెలిపింది. శ్రీశైలం నుంచి 850 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారానే కాకుండా 800 అడుగుల నుంచి నీటిని లిఫ్ట్‌ చేసేందుకు మార్పులను కూడా ప్రతిపాదించటాన్ని ప్రస్తావించింది. ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసే విధానం మారుతుందని, ప్రస్తుత కాలువల సామర్థ్యాన్ని పెంచడం, అదనంగా కాలువల తవ్వకం, డైవర్షన్‌ కెనాల్స్‌ ఏర్పాటు ద్వారా ఎక్కువ ప్రాంతాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టమవుతున్నదని తెలిపింది. ప్రస్తుత కాలువల విస్తరణ, అదనపు కాలువల నిర్మాణంతో వన్యప్రాణుల అభయారణ్యాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాలు ప్రభావానికి గురయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది. ఆ ప్రభావాన్ని తప్పకుండా మదింపు చేయాల్సిందేననే తెలంగాణ ప్రభుత్వ వాదనలను ఎన్జీటీ పరిగణనలోకి తీసుకున్నది. 

తెలంగాణ అఫిడవిట్‌తో కేసు రీఓపెన్‌

రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ తెలంగాణ ప్రభుత్వం రాకతో మలుపు తిరిగింది. మొదట పిటిషనర్‌ (ప్రైవేటు వ్యక్తి), మిగతా ప్రతివాదుల వాదనలను విన్న ఎన్జీటీ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ నివేదిక అప్పటిదాకా వాదనల్లో కీలకంగా మారింది. అయితే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కమిటీ చెప్పడంతో ఆ నివేదికను ఎన్జీటీ పరిగణనలోకి తీసుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ తరఫున వాదనలు కూడా వినాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు విజ్ఞప్తిచేయడంతో ఎన్జీటీ విచారణను పునఃప్రారంభించింది. తెలంగాణ తరఫున జే రామచంద్రరావు, ప్రభుత్వ న్యాయవాదుల బృందం.. తెలంగాణ ఇంజినీర్ల సహాయంతో వాదనలను సమర్థంగా వినిపించింది. నిపుణుల కమిటీ నివేదిక తప్పులతడక అని నిరూపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కచ్చితంగా సాగునీటి అవసరాల కోసం ఉద్దేశించినదేనని పేర్కొన్నది. వాదనలను సమగ్రంగా విన్న ఎన్జీటీ ధర్మాసనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ కృషి, ప్రయత్నం సఫలీకృతమైంది.