శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 02:40:51

ఆర్థికం ఆగమాగం

ఆర్థికం ఆగమాగం

-స్టాక్‌ మార్కెట్లలో ఆగని పతనం

-మరింత బక్కచిక్కిన రూపాయి

-43 నెలల గరిష్ఠానికి నిరుద్యోగరేటు

-28,000 దిగువకు సెన్సెక్స్‌

-5,00,000 కోట్లు రెండ్రోజుల్లో ఆవిరైన సంపద

-రూ. 76.13 డాలర్‌ విలువ

-దేశంలో ప్రమాద ఘంటికలు

-కరోనా కాటుతో దేశ ఆర్థికవ్యవస్థకు బీటలు

-30 ఏండ్ల కనిష్ఠానికి జీడీపీ దిగజారే అవకాశం

-అన్ని దేశాల్లోనూ భయానక పరిస్థితులు

-ప్రపంచ ఆర్థికవ్యవస్థకు 4.1 ట్రిలియన్‌ డాలర్ల నష్టం

కరోనా కాటుతో దేశ ఆర్థిక వ్యవస్థ బీటలువారుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్నమహమ్మారిని ప్రతిఘటించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అత్యవసర సేవలు మినహా దాదాపు అన్నిరంగాలు స్తంభించిపోయాయి. స్టాక్‌ మార్కెట్లలో పతనం అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నానాటికీ తరిగిపోతుండటం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2%లోపే ఉంటుందని, గత 30 ఏండ్లలోఇదే అత్యంత కనిష్ఠమని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌' పేర్కొన్నది. మరోవైపు దేశంలో నిరుద్యోగ మరింత పెరుగడం తీవ్ర  ఆందోళన కలిగిస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ నోట విన్నా ఈ వైరస్‌ మాటే. చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘మహమ్మారి’ ఇప్పటికే వివిధ దేశాల్లో 58 వేలమందికిపైగా ప్రజల ప్రాణాలను కబళించడంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్నది. దీని ధాటికి చైనా సహా దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్దవైన అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు దారుణంగా పతనమవుతున్నాయి. కరోనా కాటుతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 4.1 ట్రిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశమున్నదని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ప్రపంచ మొత్తం రాబడిలో దాదాపు 5 శాతం మేరకు ఉండవచ్చు. అయితే వివిధ రకాల చర్యలు, ఉద్దీపనలతో ఈ నష్టాన్ని స్వల్పకాలంలోనే 2 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గించవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కరోనా ప్రభావం భారత్‌పైనా అధికంగానే ఉండవచ్చని స్పష్టమవుతున్నది. ఇప్పటికే గత ఆరు త్రైమాసికాల నుంచి మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని, ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠస్థాయికి పతనమయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌' అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతంగా ఉండవచ్చని గతంలో అంచనా వేసిన ‘ఫిచ్‌'.. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తన అంచనాను 2 శాతానికి కుదిస్తున్నట్టు ప్రకటించింది. ‘కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇటీవల చైనాలో పలు పరిశ్రమలు మూతపడటంతో భారత్‌లోని వివిధ పరిశ్రమలకు ముడిసరుకులు, విడిభాగాల సరఫరాలు ఆగిపోయాయి. ప్రస్తుతం చైనాలోని వివిధ పరిశ్రమల్లో మళ్లీ పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవడంతో ఆ ప్రభావం భారత్‌ ఎగుమతులను, కొనుగోలు శక్తిని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటుపై మా అంచనాను 5.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నాం. ఇది గత 30 ఏండ్లలోనే అతితక్కువ వృద్ధిరేటు’ అని ‘ఫిచ్‌' శుక్రవారం ఓ ప్రకటనలో వివరించింది. అయితే ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా మరోలా ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 4 శాతానికి పరిమితమవుతుందని, భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ వృద్ధిరేటు పుంజుకొంటుందని ఏడీబీ పేర్కొన్నది. వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్నులకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయరంగంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థపై వత్తిడిని తగ్గించేందుకు చేపడుతున్న చర్యలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వేగవంతంగా పుంజుకొనేందుకు దోహదం చేస్తాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త యసుయుకీ సవాడ అభిప్రాయపడ్డారు.

స్టాక్‌ మార్కెట్లలో ఆగని పతనం

కరోనా ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లను రోజురోజుకూ కుంగదీస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 45 శాతం మేరకు పతనమైన సెన్సెక్స్‌.. మరో 670 పాయింట్లు క్షీణించి 28 వేల దిగువకు పడిపోయింది. అలాగే జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 170 పాయింట్లు (2.06 శాతం) క్షీణించి 8,083.80 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠస్థాయికి దిగజారడం మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. ఫలితంగా ఓ దశలో 27,500 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయిన సెన్సెక్స్‌.. చివరకు 674.36 పాయింట్ల నష్టంతో 27,590.95 వద్ద ముగిసింది. దీంతో గత రెండ్రోజుల్లో రూ.4,82,034.63 కోట్ల సంపదను కోల్పోయారు.

మరింత బక్కచిక్కిన రూపాయి

రూపాయి మారకం విలువ రోజురోజుకూ దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఆల్‌టైమ్‌ కనిష్ఠస్థాయికి చేరిన రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే మరో 53 పైసలు క్షీణించింది. దీంతో డాలర్‌ విలువ రూ.76.13కు పెరిగింది. 

43 నెలల గరిష్ఠానికి నిరుద్యోగరేటు

మరోవైపు దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగి దాదాపు 9 శాతానికి చేరింది. గత 43 నెలల్లో ఇదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశ నిరుద్యోగరేటు గత నెలలో 8.74 శాతానికి చేరిందని, డీమానిటైజేషన్‌ తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. రాష్ర్టాలవారీగా చూస్తే ఈ ఏడాది మార్చిలో నిరుద్యోగరేటు త్రిపురలో అత్యధికం (29.9 శాతం)గా, పుదుచ్చేరిలో అత్యల్పం (1.2 శాతం)గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది.

సేవలరంగానికి దెబ్బ

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా తీవ్రత అంతగా లేకపోవడం కాస్త ఊరటనిస్తున్నది. దీన్ని ఇంతటితోనే కట్టడిచేయగలిగితే ఆర్థిక సంక్షోభం నుంచి మనం కొంతవరకు బయటపడినట్టే. కానీ సేవలరంగంతోపాటు ఐటీ, ఆతిథ్య, పర్యాటక రంగాలు దెబ్బతినే అవకాశమున్నది. దేశీయ ఉత్పత్తుల క్రయవిక్రయాలను దేశంలోనే జరుపుకోవడం ద్వారా మనం గట్టెక్కవచ్చు. కరోనాను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తున్నది. దీంతో మన దేశానికి ఆర్థికంగా మిగతా దేశాలంత గడ్డుపరిస్థితి  ఉండకపోవచ్చు. 

- నర్సింహమూర్తి, ప్రముఖ ఆర్థికవేత్త

యుద్ధప్రాతిపదికన విధాన నిర్ణయాలు తీసుకోవాలి..

సామాజిక, ఆర్థిక కోణంలో గమనిస్తే కోవిడ్‌-19 భారత చరిత్రలో అతిపెద్ద సంక్షోభం. దీనిపై జరుపుతున్న పోరాటంలో విజయం సాధించాలంటే యుద్ధప్రాతిపదికన విధాన నిర్ణయాలను తీసుకోవాలి. ఈ యుద్ధం ముగిశాక ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా కాటుతో నష్టపోయిన పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించాలి. ఆర్థిక విధ్వంసాన్ని నిరోధించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు తక్కువ వడ్డీరేట్లతో దీర్ఘకాలిక రుణాలను మంజూరుచేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్లీ పరుగు పెడుతుంది. 

- ఎస్పీ రెడ్డి, సీఎండీ, టెర్మినస్‌ వెంచర్స్‌

తెలంగాణకూ నష్టం తప్పదు..

కరోనా దుష్ప్రభావం నుంచి తెలంగాణకూ మినహాయింపు ఉండదు. దీనివల్ల రాష్ర్టానికి ఎంత నష్టం జరుగుతుందో అంచ నా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు జరగకూడని నష్టం జరిగింది. కానీ మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఈసారి వ్యవసాయరంగంలో అభివృద్ధి నిలకడగానే ఉండవచ్చు.  2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయాధివృద్ధి రేటు.. 2019-20లో 19.3 శాతానికి పెరిగింది. పంటలకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ సంక్షోభ సమయంలో చాలావరకు సానూకూల ఫలితాలను ఇవ్వవచ్చు.

 - డాక్టర్‌ కే సుహాసిని, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త

కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల  ఇటీవల చైనాలో పలు పరిశ్రమలు మూతపడటంతో భారత్‌లోని వివిధ పరిశ్రమలకు ముడిసరుకులు, విడిభాగాల సరఫరాలు ఆగిపోయాయి. ప్రస్తుతం చైనాలోని వివిధ పరిశ్రమల్లో మళ్లీ పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవడంతో ఆ ప్రభావం భారత్‌ ఎగుమతులను, కొనుగోలు శక్తిని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటుపై మా అంచనాను 5.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నాం. ఇది గత 30 ఏండ్లలోనే అతితక్కువ వృద్ధిరేటు.

- ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌'

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా తీవ్రత అంతగా లేకపోవడం కాస్త ఊరటనిస్తున్నది. దీన్ని ఇంతటితోనే కట్టడిచేయగలిగితే ఆర్థిక సంక్షోభం నుంచి మనం కొంతవరకు బయటపడినట్టే.  కానీ సేవలరంగంతోపాటు ఐటీ,         ఆతిథ్య, పర్యాటక రంగాలు దెబ్బతినే అవకాశమున్నది. 

- నర్సింహమూర్తి, ప్రముఖ ఆర్థికవేత్త

కరోనా దుష్ప్రభావం నుంచి తెలంగాణకూ మినహాయింపు ఉండదు. దీనివల్ల రాష్ర్టానికి ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు జరగకూడని నష్టం జరిగింది. కానీ మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఈసారి వ్యవసాయరంగంలో అభివృద్ధి నిలకడగానే ఉండవచ్చు.  

-డాక్టర్‌  సుహాసిని, వ్యవసాయ ఆర్థికవేత్త


logo