బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:41:15

సడలింపు ఎలా?

సడలింపు ఎలా?

  • లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రపంచవ్యాప్తంగా సమాలోచన
  • దశలవారీ సడలింపుల దిశగా ఆచితూచి అడుగులు

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడిగిస్తారా లేక సడలింపులతో పాక్షికంగా ఎత్తివేస్తారా అన్నదానిపై అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నాయన్నదానిపై ఆసక్తి నెలకొన్నది. 

న్యూజిలాండ్‌: నాలుగు దశల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేత. ఆంక్షల్ని అమలు చేస్తూనే సడలింపులు. పదేండ్లలోపు విద్యార్థులకు పాఠశాలల పునరుద్ధరణ. పిల్లలకు సహాయకారి కచ్చితంగా ఉండాలన్న నిబంధన. వేడుకలు, అంత్యక్రియలను పది మందితోనే. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, ఆహార డెలివరీ, ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అనుమతి. కేఫ్‌లు, రెస్టారెంట్లు, మాల్స్‌, రిటైల్‌ దుకాణాల మూసివేత కొనసాగింపు. 

ఆస్ట్రేలియా: మూడు షరతులతో సడలింపు అమలు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని విస్తృతంగా (సెంటినల్‌ టెస్టింగ్‌) పెంచడం. వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తించేలా యాప్‌ను (భారత్‌లో ఆరోగ్యసేతు మాదిరిగా) అందుబాటులోకి తేవడం. హాట్‌స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక చర్యలు (సైన్యం మోహరింపు వంటివి)తీసుకోవడం. 

 జర్మనీ: ఆగస్టు వరకు వేడుకలపై నిషేధం. 800 చదరపు మీటర్ల విస్తీర్ణం వరకు ఉన్న దుకాణాలు, పుస్తకాల దుకాణాలు, బైక్‌ స్టోర్లు, కార్‌ డీలర్‌షిప్‌ షోరూంలకు అనుమతి. మే 3 వరకు నిర్ణీత దూరం నిబంధన. 4 నుంచి పాఠశాలల పునరుద్ధరణ. యజమానుల హామీతో హెయిర్‌ డ్రెసింగ్‌ సెలూన్లకు అనుమతి.   

ఫ్రాన్స్‌: లాక్‌డౌన్‌ సడలింపులు మొదలు. ప్రీ ప్రాథమిక పాఠశాలల పునరుద్ధరణ. మే 11 నుంచి ప్రాథమిక పాఠశాలలు. 15 మందితోనే తరగతులు. పిల్లల్ని స్కూళ్లకు పంపలా వద్దా అనేది తల్లిదండ్రులదే నిర్ణయం. జూన్‌ వరకు ఉన్నత విద్యా సంస్థల మూసివేత. ప్రజా రవాణా, కార్యాలయాల్లో మాస్కులు తప్పనిసరి. కేఫ్‌లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేత కొనసాగింపు. 

 ఇటలీ: మే రెండో వారంలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేతకు ప్రణాళికలు. క్రమంగా సడలింపులు. బుక్‌షాప్‌లు, లాండ్రీలు, డ్రెసింగ్‌ సెంటర్లు, ఐటీ ఉద్యోగులు, కూలీలు పనులకు అనుమతి. మే 4 నుంచి పరిశ్రమలు, రెండో వారంలో సాధారణ జన జీవనం, బార్లు, రెస్టారెంట్లకు అనుమతి. సెప్టెంబరు వరకు పాఠశాలలు మూసివేత. 

స్పెయిన్‌: నాలుగు దశల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేత. గ్రామీణ ప్రాంతాల మొదలుకొని దశలవారీగా సడలింపులు అమలు. అవుట్‌డోర్‌ బార్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్మికులకు అనుమతి. 14 ఏండ్లలోపు పిల్లలు పెద్దవారి సమక్షంలో ఇంటి చుట్టూ కిలోమీటర్‌ పరిధిలో తిరిగేందుకు, మే 2 నుంచి పెద్దవాళ్లు బయట నడకకు, వ్యాయామానికి అనుమతి. దేశవ్యాప్తంగా పాఠశాలలు సెప్టెంబరులో తెరచుకునే అవకాశం. 

మరికొన్ని దేశాల్లో..

  • గ్రీస్‌లో తెరచుకున్న రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, కోర్టులు. 
  • స్విడ్జర్లాండ్‌లో హెయిర్‌ సెలూన్లు, ఫ్లవర్‌ దుకాణాలకులకు అనుమతి. మే 11 నుంచి రెండో దశ సడలింపులు. ప్రాథమిక పాఠశాలలు, రిటైల్‌ షాపులకు అనుమతి. 
  • పోర్చుగల్‌లో మే 3 నుంచి కొన్ని సడలింపులకు అవకాశం. 
  • బెల్జియంలో మే 11 నుంచి దుకాణాలకు, 18 నుంచి స్కూళ్లుకు అనుమతి
  • ఆస్ట్రియాలో మే 1నుంచి దుకాణాలు, సెలూన్లకు అనుమతి. 15 నుంచి రెస్టారెంట్లు, 29 నుంచి హోటళ్లకు అనుమతి. 
  • డెన్మార్క్‌లో మే తొలివారం నుంచి స్కూళ్ల పునరుద్ధరణ. పదోతేదీ వరకు రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేత. 

లాక్‌డౌన్‌ ఎలా ఎత్తివేయవచ్చు.... 

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు రెండు పద్ధతులు అవలంబిస్తున్నారు. మొదటిది గ్రేడెడ్‌ లేదా దశల వారీగా ఎత్తివేయడం. అంటే ఒక జిల్లా తర్వాత మరో జిల్లాను కరోనా ఫ్రీ చేయడం. వైరస్‌ రోగుల సంఖ్య సున్నాకు చేరే ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయడం. రెండొవది ఒక్క కరోనా కేసు కూడా బయటపడని కొన్ని ప్రాంతాల్లోనే సాధారణ జీవనాన్ని పునరుద్ధరించడం. అయితే   ఈ విధానం భారత్‌లో సాధ్యపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండో విధానంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కరోనా బాధితులు చేరి వ్యాప్తికి కారణమవ్వచ్చంటున్నారు. 

ఎత్తేస్తే దారుణ పరిస్థితులు: డబ్ల్యూహెచ్‌వో 

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఆంక్షల ఎత్తివేతలో తొందరపడినా, ఆలోచన లేకుండా ముందుకు వెళ్లినా కరోనా మళ్లీ వ్యాపిస్తుందని, ఎత్తివేతను సమర్థవంతంగా నిర్వహించకపోతే మరింత ప్రమాదకరమని పేర్కొంది. 


logo