శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:34:00

హద్దుల వెతలుండవ్‌!

హద్దుల వెతలుండవ్‌!

  •  భూ సమస్యల్లేని తెలంగాణ దిశగా అడుగులు
  • తొలిగిపోనున్న రైతుల బాదరబందీలు
  • భూ లావాదేవీలన్నీ పారదర్శకం 
  • సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తున్న సర్కారు

భూమి నాదంటే నాది అని లొల్లి.. ఆ లొల్లి నుంచి కొట్లాట, దాన్నుంచి పంచాయితీ. దాదాపు ప్రతి ఊర్లో ఇవే సమస్యలు. కోర్టుల దాకా పోయే కేసులు, ఏండ్ల తరబడి వాదనలు, ఎప్పుడు తేలుతుందో చెప్పలేని తీర్పు. తనదే అయినా దానికోసం జీవితాంతం పోట్లాడిన సందర్భాలు అనేకం. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎందరో అమాయక రైతులవి. ఆ జంఝాటాలకు ధరణి స్వస్తి చెప్తున్నది. ఇది నీది, ఇది అతడిది అని కచ్చిత హద్దులు గీస్తూ లొల్లి లేకుండా చేస్తూ, భూ యజమానులకు ధైర్యాన్నిస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి రాకముందు దాదాపు అన్ని గ్రామాల్లో భూ వివాదాలు ఉండేవి. రైతులు, అన్నదమ్ముల పంచాయితీ, డబుల్‌ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు, మ్యుటేషన్ల పెండింగ్‌.. ఇలా అన్నీ భూ సమస్యలే. ఈ సమస్యలన్నింటినీ ఒకే వేటుతో పటాపంచలు చేస్తున్నది ధరణి. భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కృతం చేసేందుకు తన బాధ్యతాయుత పాత్రను నిర్వర్తిస్తున్నది. ఇప్పటికే పోర్టల్‌ ద్వారా భూ లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ప్రజలే స్లాట్‌ బుక్‌ చేసుకొని వెళ్తుండటంతో వారికి భూమి అమ్మకం, కొనుగోలుపై స్పష్టమైన అవగాహన ఉంటున్నది. 

నెలలపాటు ఎదురుచూపులకు చెక్‌పెడుతూ పావుగంటలోనే పట్టా చేతికి వస్తున్న ది. ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టింది. ప్రాధాన్య క్రమంలో ఒక్కో చిక్కుముడిని విడదీస్తున్నది. పెండింగ్‌ మ్యుటేషన్ల కోసం ప్రత్యేక ఆప్షన్‌ తెచ్చింది. ఈ సమస్యలు తీరితే..  ఆపై డబుల్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌ పడుతుంది. రెవెన్యూ కోర్టుల్లోని సమస్యలను ట్రిబ్యునల్‌కు బదలాయించనున్నారు. రికార్డుల్లో చిన్న దోషాలు, ఇతర సమస్యలనూ పరిష్కరిస్తే భూ వివాదాలన్నీ పోతాయి. సమగ్ర డిజిటల్‌ సర్వే నిర్వహించి రాష్ట్రంలోని భూములన్నీ ఇంచు ఇంచు కొలుస్తామని, వివరాలు పక్కాగా నమోదు చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రికార్డులన్నీ ధరణిలో అప్‌లోడ్‌ అయితే చాలు.. భూ వివాదాల్లేని తెలంగాణ ఆవిష్కృతం అయినట్టే. 

అతి త్వరలో తెలంగాణ ఇలా..

రెవెన్యూ రికార్డులన్నీ క్లియర్‌. గ్రామాల్లో పాత భూ వివాదాలన్నీ పరిష్కారం. కొత్తగా ఎలాంటి సమస్యలేం లేవు. పల్లెలన్నీ ప్రశాంతం. అర్హులైన రైతులకు ప్రతి ప్రభుత్వ పథకం అందుతుంది. బ్యాంకులో డబ్బు వేసినంత సులభంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగిపోతాయి. అక్రమాలకు తావు ఉండదు. రెవెన్యూ సిబ్బందిపై ఆరోపణలు ఉండవు. అధికారులకు పని చాలా సులువుగా, ప్రశాంతంగా పూర్తవుతుంది. ఇదీ! త్వరలో మనం చూడబోయే ధరణి మెచ్చే తెలంగాణ.

ఆదర్శ రాష్ట్రం దిశగా..

దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రం కావాలె. క్లీన్‌ ల్యాండ్‌ రికార్డు ఉన్న అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌ ఏది? అని ప్రపంచంలో ఎవరడిగినా తెలంగాణ అని అమెరికాలో కూడా చెప్పే రోజు రావాలి. భగవంతుడు ఆ శక్తి మా అధికారులకు ఇవ్వాలని  

ప్రార్థిస్తున్నా.

- మూడు చింతలపల్లిలో ధరణి ప్రారంభం సందర్భంగా  సీఎం కేసీఆర్‌