శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:16

శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద

శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద

  • జూరాలలో 9 గేట్ల నుంచి నీటి విడుదల
  • ఎస్సారెస్పీకి 11,087 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
  • ఎల్‌ఎండీలో నీటినిల్వ 10 టీఎంసీలు 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ప్రాజెక్టులు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి. జూరాలకు ఎగువ నుంచి వరద పెరుగుతున్నది. ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 95,000 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 79,396 క్యూసెక్కులుగా నమోదయింది. ఎగువన జూరాలతోపాటు, మధ్యలోనుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి సుమారు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. తుంగ నదికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని బాలేగావ్‌ ప్రాజెక్టు నుంచి మిగులుజలాలతోపాటు నిజామాబాద్‌ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీలోకి 11,087 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారార్‌ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. జలాశయంలో నీటిమట్టం 10 టీఎంసీలకు చేరింది. లక్ష్మిబరాజ్‌కు 84,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 85 రేడియల్‌ గేట్లలో 35 తెరిచి అదేస్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. సరస్వతిబరాజ్‌కు 3,300, పార్వతి బరాజ్‌లోకి 2,610 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. logo