శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 02:04:22

ఎక్కడివారు అక్కడే

ఎక్కడివారు అక్కడే

  • అప్పుడే కరోనా కట్టడి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని, లేకపోతే కరోనా వైరస్‌వ్యాప్తిని నియంత్రించలేమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఏపీలో ప్రజలనుద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలోనే ఉండాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ఆప్యా యంగా మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఉన్న ఏపీ వారికి ఎలాంటి ఇబ్బంది కలుగనీయకుండా చూసుకుంటానని చెప్పారని అన్నారు. వారికి నివాసం, ఆహార సదుపాయల కల్పనలో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.  

కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే ఆ ప్రభావం భావితరాలపై పడుతుందన్నారు. కరోనా వైరస్‌ను గెలువడం కేవలం క్రమశిక్షణతోనే సాధ్యమవుతుందని చెప్పారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదన్నారు. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నదని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రావాళ్లను రాష్ట్రంలోకి అనుమతించకలేకపోయిన ఘటనలు బాధ కలిగించాయని, కానీ, కరోనా కట్టడికి తప్పదని పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సరిహద్దుకు వచ్చిన సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు.


logo