మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 16:29:39

ఇండ్లకు పరిమితమైతే కరోనా నియంత్రణ: మంత్రి ఈటల

ఇండ్లకు పరిమితమైతే కరోనా నియంత్రణ: మంత్రి ఈటల

హైదరాబాద్‌: ఎవరికి వారు ఇండ్లకు పరిమితమైతే కరోనా నియంత్రణలోకి వస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దయచేసి ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని మంత్రి ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోఠి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ..హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు కూడా బయట తిరుగుతున్నరు. కరోనా స్టిక్కర్‌ వేయించుకున్న వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో బయటతిరగొద్దని మంత్రి ఈటల కోరారు.  హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు ఇష్టమొచ్చినట్లు తిరిగితే ఊరుకునేది లేదని  మంత్రి ఈటల హెచ్చరించారు.

ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల సమాచారం కాలనీవాసులు, బస్తీవాసులు ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి 20 వేల మంది వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందిపై నిఘా పెట్టినం. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటం.ఈ నెల 31లోపు రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి జ్వరాలు ఎవరికైనా ఉన్నాయా చెక్‌ చేస్తరు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వసతులను వాడుకున్న తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రుల సేవలు తీసుకుంటం.  వైద్యారోగ్య శాఖ నిరంతరంగా పనిచేస్తోంది. కలిసికట్టుగా పనిచేసి కరోనాను పారద్రోలుదామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో తెలంగాణ వ్యక్తి ఒక్కరు కూడా చనిపోలేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కూడా వెంటిటేటర్‌పై లేరు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులో 33కు చేరాయి. 33 మందిలో ఒక్కరి పరిస్థితి కూడా విషమంగా లేదని మంత్రి ఈటల వెల్లడించారు.  


logo