శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 19:47:51

వారం రోజులు ఇంట్లో ఉంటే కరోనాను తరిమికొట్టవచ్చు: సీఎం కేసీఆర్

వారం రోజులు ఇంట్లో ఉంటే కరోనాను తరిమికొట్టవచ్చు: సీఎం కేసీఆర్

హైదరాబాద్ :  ప్రజలందరూ వారం రోజులు ఇండ్లలో ఉంటే కరోనా మహమ్మారిని మనం తరిమికొట్టవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీఎం కేసీఆర్‌ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రగతి భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఇటలీ వాళ్ళు భయంకరంగా చెడగొట్టుకున్నారు..అలాంటి దుస్థితి మనకు రావద్దు అంటే మనకు మనం దూరంగా ఉంటే బెటర్. ఇతర దేశాల నుండి వచ్చిన వారికి మళ్ళీ దయచేసి చెప్తున్నా..మీ దగ్గర్లోని అధికారులకు రిపోర్ట్ చేయండి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు ఇంట్లోనే ఉండే విధంగా ఉంచాము..కానీ అందులో నుండి కొంతమంది దుర్మార్గులు బయట తిరుగుతున్నారు. మీకు మీరు ఇంట్లోనే ఉండండి. దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా మీకు మీరు సెల్ఫ్ డిస్టన్స్ లో ఉండాలని సీఎం కేసీఆర్ రాష్ట్రప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఇంతమంచి వసతులు కల్పిస్తుంటే ఇబ్బంది ఎందుకని సీఎం కేసీఆర్  ప్రశ్నించారు. 

దురదృష్టవశాత్తు ఇవాళ కూడా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 26 కు చేరుకుంది. వీళ్లంతా కూడా ఇతర దేశాల నుండి వచ్చిన వారే. కరోనా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా సంక్రమిస్తుంది కాబట్టి ఇవాళ చాలా అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశాం. ఇవాళ్టి నుండి అన్ని అంతర్జాతీయ విమానాలు బంద్‌ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ డ్యూటీకి రావాల్సిన పని లేదని, అత్యవసర పరిస్థితి ఉన్న ఉద్యోగులు మాత్రమే డ్యూటీ కి రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.  పేపర్ వాల్యూవేషన్ చేసేవారిని కూడా రిలీవ్ చేస్తున్నామని సీఎం చెప్పారు. 

1897 యాక్ట్ ప్రకారం బిల్డింగ్, ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కూలీలకు ప్రభుత్వం, యజమాని జీతం చెల్లించాలని సీఎం ఆదేశించారు. లాక్ డౌన్ కాలంలో ఆయా సంస్థలు ఉద్యోగులకు వారం రోజుల డబ్బులు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అత్యవసరము కానీ ఆపరేషన్ లు అన్ని క్లోజ్ చేస్తామని సీఎం ప్రకటించారు. లాక్ డౌన్ నుంచి మీడియాకు మినహాయింపు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. 

వైద్యులను మనల్ని కాపాడుతారు ..వారిని మనం కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్ర సరిహద్దు లు క్లోజ్ చేస్తున్నామని, అన్ని రైళ్లను బంద్ చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ కోసం వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తాం. ప్రైవేట్ బస్సులు కూడా బంద్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ దయచేసి ఎవరి ఇండ్లలో వాళ్లే ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు.  హోం క్వారంటైన్ లో ఉన్నవారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 6వేల బృందాలు పనిచేస్తున్నాయి. బృందాలు వారి వివరాలు ఎప్పటికపుడు సేకరిస్తున్నాయి. ప్రజలంతా దయచేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


logo