హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ‘మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు..’ ఇదీ ఓ కానిస్టేబుల్ ఆవేదన. ‘నాకు రెండేండ్ల చిన్న పాప ఉంది.. అయినా..’ ఇది ఓ మహిళా కానిస్టేబుల్ మనోవేదన. ‘నా భార్యకు నా ఆరోగ్యం గురించే ఎప్పుడూ ఆందోళన..’ ఇదీ ఓ ట్రాఫిక్ ఎస్సై మాట. అయినా మేం ఎవ్వరం ఇంటి వద్ద ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మాకు మీ ఆరోగ్యంపైనే చింత. మీరంతా (ప్రజలంతా) మా కుటుంబసభ్యులే. మీ ఆరోగ్యం కోసం మేము రోడ్లపై ఉంటున్నాం. మీ ఆరోగ్యం కోసం మీరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండలేరా.. ఇదీ తెలంగాణ పోలీసుల వీడియో. నల్లగొండ రూరల్ పోలీసులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రూపొందించిన ఈ వీడియోను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. ఎంతో ఆలోచింపజేసేలా ఉన్న ఈ వీడియోకు ఒక్కరోజులోనే తొమ్మిది వేల వరకు వ్యూస్ వచ్చాయి. ‘స్టే హోం.. స్టే సేఫ్’ ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ వీడియోను పలువురు షేర్ చేస్తున్నారు.