శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 01:59:48

ఆయిల్‌హబ్‌గా తెలంగాణ

ఆయిల్‌హబ్‌గా తెలంగాణ

రాష్ట్ర నేలలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలం

  • 8 లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళిక భేష్‌  
  • వ్యవసాయ అనుబంధరంగాలకు ప్రోత్సాహం
  • ఎఫ్‌పీవోలతో అద్భుత వ్యాపార అవకాశాలు  
  • తెలంగాణ ప్యాక్స్‌లో 100 శాతం కంప్యూటరీకరణ 
  • నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు చింతల  
  • తెలంగాణ, ఏపీ నాబార్డ్‌-ఎస్‌బీఐ మధ్య ఎంవోయూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రైతులు చాలా ఉత్సాహవంతులని నాబార్డ్‌ చైర్మన్‌ చింతల గోవిందరాజులు కొనియాడారు. రాష్ట్రం లో ఎనిమిది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు ప్రణాళిక గొప్ప విషయమని, భవిష్యత్‌లో తెలంగాణ ఆయిల్‌హబ్‌గా మారుతుందని తెలిపారు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేసిన తరుణంలో రైతు ఉత్పత్తిదారుల  సహకార సంఘాలను  నాబార్డ్‌ ద్వారా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు జరుగనున్న నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి మేనేజర్ల (డీడీఎం) ప్రాంతీయ సమావేశాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ నాబార్డ్‌- ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం చింతల మాట్లాడుతూ.. తెలంగాణలో సాగునీటి వసతి పెరగడంతో భూసారం భారీగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు ఎంతో అనుకూలమైన నేలలు ఉన్నాయని.. ఈ పంట సాగుతో ఉపాధితోపాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. దేశానికి ఆయిల్‌ ఉత్పత్తులను అందించే రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని పేర్కొన్నారు. నియంత్రిత సాగు విధానంపై 30 ఏండ్లుగా అధ్యయనం జరుగుతున్నదని.. తెలంగాణలో ఈ విధానాన్ని అమలుచేసి సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా అమలుకావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.  డిమాండ్‌ ఉన్న పంటలు పండించడం ద్వారా అటు రైతులు, ఇటు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు నాబార్డ్‌ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పారు. రైతుబంధు చాలా బాగున్నదని, పీఎం కిసాన్‌ యోజనకు ఈ పథకమే స్ఫూర్తి అని పేర్కొన్నారు. 

ఎఫ్‌పీవోలతో అద్భుత అవకాశాలు

వచ్చే నాలుగేండ్లలో రైతు ఉత్పత్తిదారుల  సహకారసంఘాల (ఎఫ్‌పీవో) ద్వారా వ్యాపార అవకాశాలు అద్భుతంగా ఉండనున్నాయని గోవిందరాజులు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశాలుంటాయని చెప్పారు. రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐతోపాటు, అన్ని వాణిజ్యబ్యాంకులతో నాబార్డ్‌ కలిసి పనిచేస్తుందని ప్రకటించారు. సహకారరంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్యాక్స్‌లో 100 శాతం కంప్యూటరీకరణ పూర్తయిందని తెలిపారు. ఇదేస్ఫూర్తితో అన్నిరాష్ర్టాల్లోనూ ఫ్యాక్స్‌లో కంప్యూటరీకరణ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు వైకే రావు, జిన్నవార్‌, ఎస్‌బీఐ హైదరాబాద్‌, అమరావతి సీజీఎంలు ఓపీ మిశ్రా, సంజయ్‌ సాబే పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కేరళతోపాటు వివిధ రాష్ర్టాల నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి మేనేజర్లు సదస్సుకు హాజరయ్యారు.

 నియంత్రిత సాగు విధానంపై 30 ఏండ్లుగా అధ్యయనం జరుగుతున్నది. తెలంగాణలో ఈ విధానాన్ని అమలుచేసి సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలిచారు. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా అమలుకావాల్సిన అవసరం ఉన్నది.  డిమాండ్‌ ఉన్న పంటలు పండించడం ద్వారా అటు రైతులు, ఇటు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

- నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు


logo