మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:44

నేటి నుంచి..టిమ్స్‌ సేవలు

నేటి నుంచి..టిమ్స్‌ సేవలు

  • ప్రారంభించనున్న మంత్రి ఈటల
  • కరోనా రోగులకు అన్ని సేవలు అందుబాటులోకి
  • రాష్ట్రంలో వైరస్‌ కట్టడికి పకడ్బందీగా చర్యలు
  • ప్రైవేటు దవాఖానల్లోనూ ప్రత్యేక బెడ్లు ఏర్పాటు
  • మరి కొంతకాలం వర్క్‌ఫ్రం హోం సర్వీసులు
  • ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు, 
  • అధికారులతో మంత్రి ఈటల, సీఎస్‌ సమావేశం

కరోనా కేసుల విషయంలో ప్రైవేట్‌ దవాఖానలు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో వ్యవహరించాలి. ప్రైవేట్‌ ల్యాబొరేటరీలు నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహించాలి. కరోనా రోగులకు బెడ్లు కేటాయించని దవాఖానలపై చర్యలు కూడా తీసుకుంటాం.

- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అందించేందుకు మరిన్ని బెడ్లను సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌)ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రైవేటు దవాఖానలోనూ ప్రత్యేక బెడ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. టిమ్స్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం టిమ్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. 

అంతకుముందు బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. అధికారులు, ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలతో విడివిడిగా భేటీ అయ్యారు. అనంతరం వైద్యశాఖాధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. సత్వర వైద్యం, పరీక్షల నిర్వహణ, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ విధానం ద్వారా వైరస్‌ కట్టడిచేయాలని నిర్ణయించారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పాజిటివ్‌ వచ్చినవారికి తక్షణం వైద్యమందించేలా దవాఖానలను సిద్ధం చేస్తున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి ఇంటివద్దే వైద్యమందించడంతోపాటు, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేయడం, వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారిని నిత్యం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 


లాభాపేక్షలేకుండా వ్యవహరించాలి

కరోనా కేసుల విషయంలో ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో వ్యవహరించాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. కొన్ని ప్రైవేట్‌ ల్యాబోరేటరీల్లో నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు వెలువడిన నేపథ్యంలో నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రైవేటు దవాఖానల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు, పాజిటివ్‌ వచ్చినవారికి వైద్యమందించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది.  కరోనా పేషంట్లకోసం ప్రత్యేకంగా బెడ్లు కేటాయించాలని ఆయా దవాఖానల యజమాన్యాలను మంత్రి ఈటల ఆదేశించారు. బెడ్లు కేటాయించని దవాఖానలపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంకంటే ప్రజలు బయట తిరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ ను మరికొంతకాలం కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం.


logo