ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:30:11

ఉపాధిలో తెలంగాణ దూకుడు

ఉపాధిలో తెలంగాణ దూకుడు

 • 12.71 కోట్ల పనిదినాలు పూర్తి
 • మూడేండ్లలో ఈ ఏడాదే అధికం
 • ఎక్కువ ఉపాధి కల్పించిన జిల్లాలు 28 
 • కొత్తగా జాబ్‌కార్డుదారులు 2.7 లక్షలు 
 • బకాయిలు చెల్లించని కేంద్రం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పనుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. రాష్ర్టానికి ఈ ఏడాది 13.66 కోట్ల పనిదినాలు కేటాయించగా.. ఇప్పటికే 12.71 కోట్ల పనిదినాలను పూర్తిచేసింది. దీంతో గడిచిన మూడేండ్లలో అత్యధిక పనిదినాలు వాడుకున్న సంవత్సరంగా 2020-21 నిలిచింది. రాష్ట్రంలో 1.6 లక్షల కుటుంబాలు ఇప్పటికే వంద రోజుల పనిని పూర్తిచేశాయి. గతంలో ఎన్నడూలేనంతగా రికార్డుస్థాయిలో 2.7 లక్షల మంది కొత్తగా ఉపాధి హామీ జాబ్‌కార్డులు తీసుకున్నారు.  గతేడాదితో పోలిస్తే 28 జిల్లాలు, 456 మండలాలు అత్యధికంగా పనిదినాలను సృష్టించాయి. దీంతో ఉపాధి కల్పన 32.35 శాతం పెరిగింది. ఇక 28 జిల్లాలు గతేడాది కంటే ఎక్కువ ఉపాధిని సృష్టించాయి. మహబూబాబాద్‌, జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు తక్కువ ఉపాధి కల్పించాయి. ఎక్కువ ఉపాధి చూపిన జిల్లాగా కామారెడ్డి నిలిచింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ సమగ్ర స్వరూపం, ఈ ఏడాది ప్రత్యేకతలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.

ఆరునెలల్లోనే 43 రోజుల పని 

గతేడాది సగటున ఒక్కో కుటుంబానికి 43 రోజుల పని దొరుకగా.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే సగటున ఒక్కో కుటుంబానికి 43 రోజులు పని లభించింది. మొత్తంగా 1.6 లక్షల కుటుంబాలు 100 రోజుల పనిని పూర్తి చేసుకున్నాయి. ఇక 540 మండలాల్లో 456 మండలాలు గతేడాదికంటే ఎక్కువ పని కల్పించాయి. కరోనా ఆపత్కాలంలో కూడా 270 మండలాలు ఎక్కువ శాతం మార్పును చూపించాయి. 

కేంద్ర బకాయిలు రూ.5.99 కోట్లు

ఉపాధి హామీ పనులు కల్పించడంలో రాష్ట్రం దూసుకుపోతుంటే.. కూలీలకు వేతనాల చె ల్లింపును కేంద్రం నిలిపివేసింది. తిరస్కరించిన పేమెంట్స్‌ రూ. 2.25కోట్లు, సస్పెండెడ్‌ పేమెంట్స్‌ రూ.3.74కోట్లు కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సినవి ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా ఇలా రూ.291.06 కోట్లు బకాయిలు ఉన్నాయి. 

దేశంలో ఉపాధి హామీ వివరాలు

 • ఉపాధి హామీ కింద నమోదైన కుటుంబాలు 13.62 కోట్లు, కూలీలు 26.03 కోట్లు
 • ఆక్టివ్‌గా పనిచేస్తున్న కుటుంబాలు 8.57 కోట్లు, కూలీలు 13.19 కోట్లు
 • కూలీల్లో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలవారి శాతం 19.53, 15.69 
 • కూలీలకు కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన మొత్తం రూ.291.06 కోట్లు

రాష్ట్రంలో ఉపాధి హామీ వివరాలు

 • ఉపాధి హామీ కింద నమోదైన కుటుంబాలు 52.3 లక్షలు, కూలీలు 1.12 కోట్లు
 • ఈ ఆర్థిక సంవత్సరంలోనే నమోదైన కుటుంబాలు 2.68 లక్షలు, కూలీలు 5.84 లక్షలు
 • కూలీల్లో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారి శాతం 16.55, 13.98
 • ఉపాధిని ఉపయోగించుకున్న మహిళా కూలీల శాతం 58.04 శాతం
 • కూలీలకు కేంద్ర ప్రభుత్వం బకాయి పడిన మొత్తం రూ.5.99 కోట్లు