ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:28:11

ఒక్క క్లిక్‌లో రాష్ట్ర సమాచారం

ఒక్క క్లిక్‌లో రాష్ట్ర సమాచారం

  • ప్రణాళికా సంఘం వెబ్‌సైట్‌ను ప్రజాప్రతినిధులు ఉపయోగించాలి
  • ‘తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌' పుస్తకావిష్కరణలో వినోద్‌కుమార్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాలనలో ప్రణాళికా సంఘం పాత్ర కీలకమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం గణాంక   భవన్‌లో ‘తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌' పుస్తకాన్ని ఆర్థిక, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో కలిసి వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వశాఖకు ప్రణాళిక శాఖ దిక్చూచిగా నిలుస్తుందని తెలిపారు.  రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తేవటం గొప్ప  విషయమని కొనియాడారు.  ఈ సమగ్ర      సమాచారం http://tsdps. telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు విధిగా ఈ వెబ్‌సైట్‌ నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవాలని, ఆయా సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలని వినోద్‌కుమార్‌ కోరారు. ఆర్థిక, ప్రణాళికశాఖ  ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామ స్థాయి సమాచారంతో పుస్తకాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ పుస్తకంలో రాష్ట్రానికి చెందిన జీఎస్డీపీ అంచనాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలు, పలు సర్వే గణాంక సమాచారం, రాష్ట్రప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలు ఉన్నాయి. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) సీఈవో జీ దయానంద్‌,  రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, సీజీఎస్‌ సంస్థ ప్రతినిధి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


23 వేల పడకలు

రాష్ట్రంలో 152 జనరల్‌ దవాఖానలు ఉన్నాయి. వాటిలో 22 ప్రత్యేక చికిత్సను అందించేవి. 74 డిస్పెన్సరీలు, 49 ప్యానెల్‌ క్లినిక్స్‌, 885 పీహెచ్‌సీలు ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాయి. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా 4,797 సబ్‌ సెంటర్లు ఉం డగా, 110 బస్తీ దవాఖాన లు సేవలందిస్తున్నాయి. మొ త్తం 23వేల పడకలు అందుబాటులో ఉన్నాయి.  

మదర్‌, చైల్డ్‌ కేర్‌లో ముందున్న కామారెడ్డి 

మదర్‌ కేర్‌ సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ పథకంలో భాగంగా మొత్తం 4.09లక్షల మంది ఎన్‌రోల్‌ చేసుకోగా, 3.37 మంది లబ్ధి పొందారు. కామారెడ్డి జిల్లా వారు అత్యధికంగా లబ్ధిపొందగా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి చివరి స్థానంలో ఉన్నది. చైల్డ్‌ కేఆర్‌ సప్లిమెంటరీ న్యూట్రిషన్‌లోనూ కామారెడ్డి ముందుండగా రంగారెడ్డి జిల్లా చివరిస్థానానికి పరిమితమైంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు రాష్ట్రంలో 15.69లక్షలు ఉండగా, అత్యధికంగా 92% మం ది కామారెడ్డి జిల్లాలో, అత్యల్పంగా 72%తో ఆసిఫాబాద్‌ కుమ్రంభీం చివరిస్థానంలో ఉన్నది.  

పరిశ్రమల ఖిల్లా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

రాష్ట్రంలో 11,679 గుర్తింపు పొందిన పరిశ్రమలు ఉండగా, 8.6లక్షల మంది ఉద్యోగులు, 7.3 లక్షల మంది శ్రామికులు పని చేస్తున్నారు. అత్యధికంగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో ఫ్యాక్టరీలు ఉండగా, నిజామాబాద్‌లో అత్యధిక మంది ఉద్యోగులున్నారు. శ్రామికులు సైతం నిజామాబాద్‌లోనే అధికంగా ఉండటం గమనార్హం. అత్యల్పంగా నారాయణపేట్‌లో 44 ఫ్యాక్టరీలే ఉన్నాయి.