ఆదివారం 24 మే 2020
Telangana - Mar 09, 2020 , 03:07:27

వృద్ధిరేటులో టాప్‌

వృద్ధిరేటులో టాప్‌
  • రూ.9,69,604 కోట్లకు పెరిగిన రాష్ట్ర సంపద
  • తలసరి ఆదాయం రూ.2.28లక్షలు
  • జీడీపీలో పెరిగిన తెలంగాణ వాటా
  • సామాజిక, ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ సంపద ఈ ఏడాది కూడా గణనీయంగా పెరిగింది. దేశంలో అగ్రభాగాన నిలుస్తున్న తెలంగాణలో తలసరి ఆదాయం కూడా వేగంగా పెరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఐదేండ్లలోనే తెలంగాణ మొత్తం సంపద లేదా జీఎస్డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.9,69,604 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో తెలంగాణ మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ.8,61,031 కోట్లుగా ఉన్నది. గతేడాది తెలంగాణలో 14.3 శాతంగా నమోదైన జీఎస్డీపీ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 12.6 శాతానికి తగ్గినప్పటికీ రాష్ట్ర సంపద మరో రూ.1,08,573 కోట్ల మేరకు పెరిగింది. 


ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధిరేటు 11 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గడం గమనార్హం. స్థిర ధరల ప్రకారంగా చూస్తే మన రాష్ట్ర సంపద రూ.6,12,828 కోట్ల నుంచి రూ.6,63,258 కోట్లకు పెరిగింది. కానీ, గతేడాది 9.5 శాతంగా జీఎస్డీపీ వృద్ధిరేటు ఈసారి 8.2 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో కేంద్ర జీడిపీ 6.1 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. అంటే తెలంగాణ వృద్ధిరేటు దేశ సగటు కంటే 3.2 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.


తలసరి ఆదాయం 11.6 శాతం వృద్ధి

మరోవైపు రాష్ట్ర తలసరి ఆదాయం వేగంగా వృద్ధి చెందతున్నది. గతేడాది రూ.2,04,488గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఈ ఏడాది 11.6 శాతం వృద్ధిరేటుతో రూ.2,28,216కు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,35,050కి, వృద్ధిరేటు 6.4 శాతానికి పరిమితమైంది. గత కొన్నేండ్ల నుంచి తెలంగాణ సంపద అంచనాలను మించి పెరుగుతున్నట్టు తాజాగా వెలువడిన ఆర్థిక, సామాజిక సర్వే నివేదిక-2020 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ టాప్‌

ప్రస్తుత ధరల వద్ద మొత్తం సంపద వృద్ధిరేటులో తెలంగాణ మిగిలిన పెద్ద రాష్ర్టాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఐదేండ్లుగా మన రాష్ట్రం 14.2 శాతం సగటు వృద్ధిరేటును సాధించింది. తెలంగాణ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, హర్యానా నిలిచాయి. ఈ రాష్ర్టాల వృద్ధిరేటు 13 శాతం లోపే ఉన్నది. చిన్న రాష్ర్టాలైన సిక్కిం, త్రిపుర 14.4 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ కంటే కాస్త ముందున్నాయి. స్థిర ధరల ప్రకారంగా చూస్తే.. గత ఐదేండ్లలో మన రాష్ట్రం 10.2 శాతం వృద్ధిరేటుతో పెద్ద రాష్ర్టాల్లో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఈ జాబితాలో ఒక్క కర్ణాటక మాత్రమే 11 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ కంటే ముందున్నది. మరోవైపు జాతీయ సంపదలో తెలంగాణ వాటా క్రమంగా పెరుగుతున్నది. గతంలో 3 నుంచి 4 శాతంలోపే ఉన్న తెలంగాణ వాటా గతేడాది 4.29 శాతానికి, ఈ ఏడాది 4.52 శాతానికి పెరుగడం విశేషం.


బాలరక్షతో భరోసా

తెలిసీ తెలియని వయస్సులో నేరంచేసిన చిన్నారుల భవిష్యత్‌ అంథకారం కా కుండా సర్కారు చూస్తున్నది. బాలరక్ష భవన్ల పేరుతో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో వారిని తీర్చిదిద్దుతున్నది. జువెనైల్‌హోంలలో ఉన్నవారికి కౌన్సెలింగ్‌తోపాటు న్యాయ, వైద్య సా యం ఒకేచోట అందేలా రాష్ట్ర ప్రభుత్వం బాలరక్ష భవన్లు ఏర్పాటుచేసింది. వీటిద్వారా గతేడాది 1,044 మందికి సాయం అందించినట్టు సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. ఈ చిన్నారులు భవిష్యత్తులో తమకాళ్లపై తాము నిలబడేందుకు వృత్తివిద్యలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే 111 మంది చిన్నారులకు గ్యాస్‌వెల్డింగ్‌, ఆటోమొబైల్‌ రిపేరింగ్‌, డ్రైవింగ్‌, కంప్యూటర్‌సహా పలు కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగం గా ‘నేను సైతం’ ప్రాజెక్టు కింద మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 5.44 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసినట్టు సామాజిక ఆర్థికసర్వే నివేదిక వెల్లడించింది. మహిళల భద్రతలో భాగంగా రాచకొండ సీపీ పరిధిలో ‘షీ ఫర్‌ హర్‌' పేరిట వెయ్యిమంది వలంటీర్లను షీటీమ్స్‌ సిబ్బంది సహకారంతో ఏర్పాటుచేశారు. 


లక్షకోట్లు దాటిన ఐటీ ఎగుమతులు


తెలంగాణ 2018-19లో ఐటీ ఎగుమతుల్లో రూ.1.09 లక్షల కోట్ల ఎగుమతులతో 17% వృద్ధిరేటు సాధించిం ది. ఐటీ ఎగుమతుల్లో జాతీయ వృద్ధి రేటు 7.8% ఉండగా.. తెలంగాణ వృ ద్ధిరేటు దానికి రెట్టింపు కన్నా ఎక్కువ గా ఉన్నదని ‘సామాజిక ఆర్థిక సర్వే’ నివేదిక స్పష్టంచేసింది. మొత్తం ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 11 శాతంగా ఉన్నదని తెలిపింది. ఐటీరంగం ద్వారా పెద్దమొత్తంలో ఆదా యం పొందుతున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2014-15లో రూ.60 వేల కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, 2018-19 కల్లా రూ.1.09 కోట్లకు చేరుకొన్నది. ఐదేండ్లలో ఐటీరంగం ద్వారా ఉపాధి కల్పనలో 9.9% వృద్ధి రేటు సాధించింది. స్టార్టప్‌లకు చేయూత అందిచేందుకు టీ హబ్‌ను, మహిళలను పారిశ్రామికరంగంవైపు ప్రోత్సహించేలా వీహబ్‌ను ప్రారంభించి ఆ దిశగా కృషిచేస్తున్నది. ద్వితీయ శ్రేణినగరాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో సంస్థల ఏర్పాటుకు కృషి జరుగుతున్నది. 


అసహాయులకు ఆసరా


అసహాయులకు అండగా ఉంటామని కేసీఆర్‌ ప్రభు త్వం మరోసారి స్పష్టంచేసింది. దివ్యాంగులు, ఆసరా లబ్ధిదారులకు ఇచ్చే పెన్షన్ల కోసం భారీగా నిధులు కేటాయించింది. ఎన్నికల హామీ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 57ఏండ్లు దాటినవారికి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య ఐదారు లక్షల వరకు పెరుగనున్నది. ఆసరా పెన్షన్లకు గతబడ్జెట్‌లో రూ. 9,402 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.11,758 కోట్లకు పెంచారు. ఈ పథకంలో 39,41,976 మంది లబ్ధిదారులున్నారు. ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు రూ.3,016, ఆసరా లబ్ధిదారులకు రూ.2,016 చొప్పున చెల్లిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మ హిళలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు, నేత, గీత కార్మికులు 2,016 పెన్షన్‌ పొందుతున్నారు.    


వడ్డీలేని రుణాలు కొనసాగింపు

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చే పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించింది. రూ. 1,200 కోట్లను వడ్డీలేని రుణాల కింద ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సెర్ప్‌, స్త్రీనిధి రుణాలతోపాటు ఈ రుణాలు అదనంగా ఇవ్వనున్నారు. వడ్డీ రాయితీని ప్రభుత్వమే భరిస్తున్నది. దాదాపు రూ. 2,100 కోట్లను వడ్డీ కింద మహిళలకు మంజూరుచేశారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించటం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులతో డిపోల్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కండక్టర్లు, డ్రైవర్లకు మరింత లబ్ధి చేకూరుతుంది. 

- అంకది మల్లేశ్‌, డ్రైవర్‌, మహబూబాబాద్‌ డిపో


నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహా కవి దాశరథి నినదిస్తే... నా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం కావాలని కేసీఆర్‌ స్వప్నించారు. ఈ కల నెరవేరేందుకు అహరహం శ్రమిస్తున్నారు. కృష్ణా గోదావరిలో నీటిని సమగ్రంగా వినియోగించుకు నేందుకు ప్రాజెక్టులను రీడిజైన్‌ చేశారు. 

- బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుlogo