శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 18:18:15

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

సిద్దిపేట : రైతును రాజుగా చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లద్నూర్‌లో రైతు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ జీడికంటి సుదర్శన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు తమ సమస్యలను ఒక చోట చేరి చర్చించుకోవడానికి వీలుగా గ్రామాల్లో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో సైతం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబంధు, మిషన్‌భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.


రాబోయే తరాలకు సచివాలయం అనేది ‘తెలంగాణ నిషాన్‌'గా ఖ్యాతి పొందనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొక్కను నాటి నీళ్లను పోశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డా. గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo