శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 02:04:25

తగ్గిన విమాన ప్రయాణాలు

తగ్గిన విమాన ప్రయాణాలు
  • కరోనా నిరోధానికి విస్తృత చర్యలు
  • విమానాశ్రయాల్లో 12 లక్షల మందికి వైరస్‌ స్క్రీనింగ్‌
  • ‘వింగ్స్‌ ఇండియా’కు రాష్ట్ర ప్రభుత్వం అద్భుత సహకారం
  • కొత్త విమానాల కొనుగోలుకు పలు సంస్థలు సిద్ధం
  • పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:కరోనా వైరస్‌ ప్రభావంతో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 20 శాతం మేరకు తగ్గిందని పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి వెల్లడించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నామని, ఇప్పటివరకు 12 లక్షల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనాను నిరోధించేందుకు భారత విమానాశ్రయాలు ఇతర దేశాల విమానాశ్రయాల కంటే అత్యుత్తమంగా కృషిచేస్తున్నాయన్నారు. ‘వింగ్స్‌ ఇండియా-2020’ కార్యక్రమంలో మూడోరోజైన శనివారం బేగంపేట విమానాశ్రయంలో జరిగిన మినిస్టీరియల్‌ ప్లీనరీలో హర్దీప్‌సింగ్‌పూరి మాట్లాడుతూ.. కరోనా సమస్య తాత్కాలికమేనని, దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య త్వరలోనే మళ్లీ పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. కరోనా నేపథ్యంలో ‘వింగ్స్‌ ఇండియా-2020’ను వాయిదావేయాలని సూచనలు వచ్చాయని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అందించిన అద్భుత సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ‘వింగ్స్‌ ఇండియా-2020’లో 110 కంపెనీలు ప్రదర్శనలను ఏర్పాటుచేశాయని, 15 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 2,000కుపైగా విమానాల కొనుగోలుకు వివిధ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ముం బై, పుణె లాంటి ఆరు పెద్ద విమానాశ్రయాలను విస్తరించడం కుదరదని, వాటికి సమీపంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని హర్దీప్‌సింగ్‌పూరి చెప్పారు. 


మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్‌ను యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మినిస్టర్‌గా అభివర్ణించారు. నవభారత నిర్మాణానికి కేటీఆర్‌ ప్రతినిధిగా నిలుస్తారని కొనియాడారు. ‘వింగ్స్‌ ఇండియా’ నిర్వహణకు మంత్రి కేటీఆర్‌, ఆయన అధికారుల బృందం తమకు ఎంతగానో సహకరించిందన్నారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ట్విట్టర్‌ ద్వారా కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 


ద్వితీయశ్రేణి నగరాలకు విమానసేవలు: కేటీఆర్‌ 

దేశీయ విమానయానరంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రీజినల్‌ కనెక్టివిటీ స్కీం (ఆర్సీఎస్‌) కింద ద్వితీయశ్రేణి నగరాలకు విమానయాన సర్వీసులను విస్తరించాల్సిన అవసరం ఉన్నదని ‘వింగ్స్‌ ఇండియా’ మినిస్టీరియల్‌ ప్లీనరీలో కేటీఆర్‌ ఉద్ఘాటించారు. రానున్న రెండు దశాబ్దాల్లో 2,400 కొత్త విమానాలను కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎమ్మార్వో కేంద్రాలకు జీఎస్టీని మినహాయించాలని కోరారు. హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ విమానాయశ్రయంలో ఇటీవల ఎఫ్‌ఎస్‌టీసీ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. విమానయానరంగం ద్వారా పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తెలంగాణలో నైపుణ్యమున్న యువతను తీర్చిదిద్దేందుకు ‘టాస్క్‌'ను ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరితో కలిసి మంత్రి కేటీఆర్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సహా వివిధ విమానాశ్రయాలకు, విమానయాన సంస్థలకు స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అరవింద్‌సింగ్‌, ఫిక్కీ సివిల్‌ ఏవియేషన్‌ విభాగం చైర్మన్‌ ఆనంద్‌స్టాన్లీ, పౌరవిమానయానశాఖ సంయుక్త కార్యదర్శి ఉషాపది తదితరులు పాల్గొన్నారు. 
వైద్య రంగంలో డ్రోన్ల సేవలు డీజేఐతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం 

వింగ్స్‌ ఇండియా-2020 సందర్భంగా పలు సంస్థలు ఒప్పందాలు కుదర్చుకున్నాయి. వైద్యరంగంలో డ్రోన్ల సేవలను వినియోగించుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం డీజేఐ ఏషియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఈ తరహా డ్రోన్‌ను ఆపోలో హాస్పిటల్‌ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసింది. ఈ ప్రక్రియను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ వీక్షించారు. ప్రజలకు ఉత్తమ వైద్యసేవలందించేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందని, ఈ తరహా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ‘కృషి ఉడాన్‌' పథకం అమలులో భాగంగా రస్‌ అల్‌ఖైమా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, జీఎమ్మార్‌, ైస్పెస్‌జెట్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. విమానయానరంగంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్‌బస్‌ సంస్థతో జీహెచ్‌ఐఏఎల్‌ ఎంవోయూను కుదుర్చుకొన్నది.logo