e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home Top Slides పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల తీరు!

పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల తీరు!

  • పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు!
  • ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల తీరు
  • కేసీఆర్‌పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్‌
  • నచ్చే జవాబు వచ్చేందుకే లోక్‌సభలో ప్రశ్నలు
  • కేంద్రం జవాబు పేరుతో ఇరుకునపెట్టే పన్నాగం
  • ఫలించని వ్యూహం.. తప్పని ఆశాభంగం
  • రాష్ట్ర సర్కారుకు కితాబిస్తున్న కేంద్ర ప్రభుత్వం

మా రాష్ర్టానికి జాతీయ రహదారులు ఇవ్వండి.. ఫలానా పథకానికి నిధులివ్వండి.. మా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించండి.. మా రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి.. ఇవి.. సాధారణంగా దేశ అత్యున్నత చట్టసభల్లో ఆయా రాష్ర్టాల ఎంపీలు అడిగే ప్రశ్నలు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు మాత్రం.. ఫలానా ప్రాజెక్టుకు రాష్ట్రం ఖర్చు పెడుతున్న సొంత నిధులను మరే పథకానికైనా మళ్లించారా? అవకతవకలైనయా?! పోనీ వాటికి వారు కోరుకున్నట్టు జవాబులు వచ్చాయా? అంటే అదీ లేదు! అడిగిన ప్రతి ప్రశ్నకూ కేంద్రం తెలంగాణకు క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారి ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం పై కొట్లాడి, సమస్యలపై నిగ్గదీసి, పరిష్కారాలు సాధించాల్సిన ఎంపీలు కుత్సిత మనస్తత్వంతో చేస్తున్న వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది.

ఏరాష్ట్రంలోనైనా విపక్షం, అధికార పక్షం మధ్య విమర్శలు, ఆరోపణలు సహజం! కానీ.. అధికార పక్షంపై అక్కసుతో ప్రభుత్వ కార్యక్రమాలపై దుమ్మెత్తిపోసినా.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి విపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా పార్లమెంటులో పలు రాష్ర్టాల ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రంపై కొట్లాడిన సందర్భాలు ఎన్నో చూశాం! ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఈ ఐక్యత మరింత బలంగా ఉంటుంది! కానీ.. తెలంగాణలో మాత్రం విపక్షం తీరు వేరే! ఇక్కడి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తే.. ఢిల్లీ వేదికగా, పార్లమెంటు సాక్షిగా బురదజల్లే పనిని ఎత్తుకున్నాయి తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ! ప్రాజెక్టులు కట్టుకుంటూ వాటికి అనుమతుల కోసం ఏ ప్రభుత్వమైనా ప్రయత్నాలు చేస్తుంటుంది.. కానీ.. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల ప్రశ్నలు చూస్తే.. ఆ ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంటే బాగుండునన్న దుగ్ధ కనిపిస్తుండటమే ఇక్కడ విషాదం! అన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, అన్నీ సక్రమంగానే సాగుతున్నాయని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వారికి మూతోడ్‌ జవాబు ఇవ్వడం విశేషం!

- Advertisement -

హైదరాబాద్‌, జూలై 30 (నమస్తే తెలంగాణ): ‘లీడింగ్‌ క్వశ్చన్‌’ అనే మాట ఒకటి ఉన్నది. అంటే.. ఎదుటివారి నుంచి మనకు నచ్చిన సమాధానాన్ని రాబట్టుకొనే విధంగా వేసే ప్రశ్నలు వేయడం. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో మన రాష్ట్ర విపక్ష ఎంపీలు చేస్తున్న పని ఇదే. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతుండటం, ప్రజాభిమానానికి నోచుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో.. టీఆర్‌ఎస్‌పై కక్ష తీర్చుకోవడానికన్నట్టుగా అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్‌ను అడ్డగోలుగా వాడుకొంటున్నారు. రాష్ర్టానికి సంబంధించి కేంద్రం పరిష్కరించాల్సిన సమస్యలు, పెండింగ్‌ నిధులు ఎన్నో ఉన్నాయి. ఆమోదం తెలపాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదాని గురించీ మన విపక్ష ఎంపీలకు పట్టడంలేదు. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంపై చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా చేయకపోతుందా.. చేస్తే దాని తోక పట్టుకుని ఎలా రాజకీయ పబ్బం గడుపుకొందామా.. అన్న ఆలోచనే కనిపిస్తున్నది. ఆ ప్రయత్నంలో అడ్డదిడ్డ ప్రశ్నలు వేసి.. యావత్‌ పార్లమెంట్‌లో నవ్వులపాలవుతున్నారు. గమ్మత్తేమిటంటే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది.. అయినా తెలంగాణకు ఎంపీలు వేసిన ప్రశ్నలన్నింటికీ లిఖితపూర్వకంగా ఇస్తున్న జవాబుల్లో తెలంగాణకు క్లీన్‌చిట్‌ లభిస్తుండటం గమనార్హం. వీళ్లు వేస్తున్న ప్రశ్నలను ఒక్కసారి చూద్దాం.

ప్రాజెక్టుల్లో అవకతవకల్లేవన్న కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అంచనాలను పెంచి అడ్డగోలుగా నిర్మిస్తున్నదా? నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? అని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నిస్తే.. ‘రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. పెరిగిన ధరలు, జీఎస్టీ తదితర కారణాల వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.80,190.46 కోట్ల నుంచి రూ.88,557.44 కోట్లకు పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ విధానాన్ని అనుసరించి పూర్తి పారదర్శకతను పాటించింది’ అంటూ కేంద్రం తిరుగులేని స్పష్టతనిచ్చింది. కాళేశ్వరంలో ఏదో అవినీతి జరిగిందన్నట్టుగా కేంద్రం నుంచి సమాధానం రావాలని.. సంజయ్‌ కోరుకున్నా.. అది జరుగకపోగా.. రాష్ట్రం ఎంత పారదర్శకంగా వ్యవహరించిందో సాక్షాత్తూ ఆయన పార్టీ ప్రభుత్వమే కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఇదే తరహాలో ప్రాజెక్టుల్లో అవినీతి గురించి ప్రశ్నించి.. వచ్చిన జవాబుతో కిక్కురుమనలేదు.

ఇతర అంశాల్లోనూ అదేతీరు

గ్రామీణ ఉపాధి హామీ పథకం, 14, 15 ఆర్థిక సంఘం నిధుల ఖర్చు వ్యవహారం, చేపట్టిన పనుల్లో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతున్నదా? ఒకవేళ అది నిజమని తేలితే కేంద్రం ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నదా? అంటూ సంజయ్‌ ప్రశ్నించి, ఆశించిన సమాధానం పొందలేక పోయారు. ఇదే ఎంపీ.. గడిచిన ఏడేండ్లలో రాష్ర్టానికి కేటాయించిన నిధులు.. వాటిని ఉపయోగించుకున్నారా? సరైన సమయంలో యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ను తెలంగాణ రాష్ట్రం సమర్పించిందా? లేకపోతే కేంద్రం ఏమైనా చర్యలు తీసుకున్నదా? అని ప్రశ్నిస్తే.. ‘ఇదంతా ఆయా పథకానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సాగుతుంది. జనరల్‌ ఫైనాన్సియల్‌ రూల్స్‌ (జీఎఫ్‌ఆర్‌) ప్రకారం అవన్నీ కొనసాగుతాయి. ఏమైనా నిధులు మిగిలితే.. వచ్చే సంవత్సరం బడ్జెట్‌లో వాటిని అడ్జస్ట్‌ చేస్తారు’ అంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంతో మారు మాట్లాడలేని పరిస్థితి. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథక నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించింది నిజమేనా? ఉపాధి హామీ పథకం నిధులను ఖర్చు పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతున్నదా? అని తెలివైన ప్రశ్న వేశాననుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్రం.. ‘కాదు, లేదు’ అని తేల్చేసింది. వాస్తవానికి ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలుచేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. కానీ.. తెలంగాణ ప్రభుత్వంపై ఎలాగైనా ఓ రాయి విసరాలి.. బురద జల్లాలి.. అనే కోణంలో కక్ష పూరితంగా ప్రశ్నలు సంధించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ర్టానికి చెందిన ప్రతిపక్ష ఎంపీల ప్రశ్నలతో కేంద్రంలోని పెద్దలకే మతిపోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలను చూస్తే.. రాష్ర్టానికి నిధులు తెద్దామనే ఆలోచన, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామనే ఉన్నతాశయం కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లేవనెత్తిన ఒక్క అంశం చాలు దాన్ని నిరూపించడానికి. ‘మేడిగడ్డ బరాజ్‌ నుంచి కాళేశ్వరం జలాశయం వరకు 22 కి.మీ పొడవునా నిలిచిన గోదావరి నీటిలో జలక్రీడలు, పడవ విహారాలు ఏర్పాటు చేయాలి. పర్యాటకులు నదీ తీరంలో ఆహ్లాదంగా గడపడానికి వసతులు కల్పించాలి. మధ్య మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొమురవెల్లి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్టుల వద్దకూడా వసతులు మెరుగుపర్చేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చొరవ చూపాలి’ అని కేంద్ర తోడ్పాటును కోరారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. 365 రోజులపాటు నదిలో నీళ్ళు దర్శనమిస్తున్నాయి. ఒక టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటుచేస్తే.. యేటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కేంద్రం చొరవ తీసుకుని జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్టును తీసుకొస్తే.. రాష్ర్టానికి, ప్రజలకు, ఎంపీకి కూడా పేరు వస్తుంది. కానీ, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలతో ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఇకనైనా మారుతారా!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana