గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:36

ధరణి @ ల్యాండ్‌ బ్యాంక్‌

ధరణి @ ల్యాండ్‌ బ్యాంక్‌

  • నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు
  • మూడేండ్లలో 5 వేల రిజిస్ట్రేషన్లు పూర్తి

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భూ రికార్డులను డిజిటలైజ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దస్ర్తాల్లో అనధికార మార్పులకు ఆస్కారం లేకుండా ధరణి పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. భూమితో సంబంధమున్న ప్రభుత్వ శాఖలు ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యే వీలు కల్పించింది. రైతులకు అన్ని సేవలు సులువుగా అందేలా ధరణిని రూపొందించారు. రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన కొత్త చట్టంలో జాయింట్‌ రిజిస్ట్రార్‌గా తాసిల్దార్లు వ్యవహరించనున్న నేపథ్యంలో ధరణి ఫలితాలు ఎలా ఉండబోతాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. భూవివాదాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం భూమి రికార్డుల నిర్వహణ పద్ధతి (టీఎల్‌ఆర్‌ఎంఎస్‌)ని తీసుకొచ్చింది. భూములకు సంబంధించిన అన్ని విషయాలను క్రోడీకరిస్తూ ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. ఇది బ్యాంకింగ్‌ తరహాలో నిర్వహించే వెబ్‌సైట్‌ అని అధికారులు చెప్తున్నారు. గ్రామస్థాయిలో చిన్నచిన్న పనులు, పేర్ల మార్పులు వంటివి చేసినా రాష్ట్రస్థాయి అధికారులకు క్షణాల్లో తెలిసిపోతుంది. ప్రతి విషయంలో పారదర్శకత, జవాబుదారీ ఉండేలా నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూతగాదాల నివారణే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించింది. భూ రికార్డులకు సంబంధించి గతంలో మా భూమి పేరిట వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండగా దానికి మరింత ఆధునికతను జోడించి ధరణి పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. 

ధరణి ప్రయోగం విజయవంతం

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌ను 2018, మే 19న రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలుచేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలో ఈ ప్రక్రియ నేటికీ కొనసాగుతున్నది. రైతులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ ఆయా మండలాల్లోనే చకచకా జరిగిపోతున్నాయి. నిత్యం నాలుగైదు డాక్యుమెంట్లు పట్టాలెక్కుతుండగా నెలకు సుమారుగా 100 నుంచి 120 డాక్యుమెంట్లకు పరిష్కారం లభిస్తున్నది. 2018లో సదాశివనగర్‌లో 618 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2019లో 1250 డాక్యుమెంట్లు, 2020 నేటి వరకు 1005 డాక్యుమెంట్లకు తాసీల్దార్లే రిజిస్ట్రేషన్‌ పూర్తిచేశారు. భూ రికార్డుల మార్పులు, చేర్పుల్లో ఇప్పటికే పారదర్శకత కోసం అన్ని స్థాయిల్లో అధికారులకు బయోమెట్రిక్‌ విధానం అమలుచేశారు. ఆన్‌లైన్‌లోకి ప్రవేశించాలంటే అధికారి వాల్‌పై వేలిముద్రను పెడితేనే కంప్యూటర్‌ ఓపెన్‌ అవుతుంది. ఇతరులు భూద స్ర్తాల్లో మార్పులు చేయడానికి ఆస్కారం ఉండబోదు. 

రిజిస్ట్రేషన్‌ ఈజీగా అయిపోయింది 

నాకు ఎకరన్నర భూమి ఉండేది. పక్కనే మరో ఎకరన్నర భూమి కొన్నా. భూమి రిజిస్ట్రేషన్‌ పట్టాదారు పాస్‌బుక్కు కోసం ఇబ్బంది లేకుండానే పనిపూర్తయింది. రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు పోలేదు. కాగితాలన్నీ తాసిల్‌ ఆఫీసులనే ఇచ్చి నం. తొందర్లోనే పట్టాదారు పాస్‌బుక్కులు చేతికిచ్చినారు.

- పెద్ద మల్లేశ్‌, ముప్కాల్‌, నిజామాబాద్‌ జిల్లా

ధరణి సాంకేతికత అద్భుతం

ధరణి వెబ్‌సైట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాము. మంచి స్పందన వస్తున్నది. ప్రతి రోజూ నాలుగైదు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. వ్యవసాయదారులకు ధరణితో మంచి ప్రయోజనాలున్నాయి. తాసీల్దార్‌కు జాయింట్‌ రిజిస్ట్రార్‌ హోదా కల్పించడంతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించడం తేలిక. తప్పుడు పత్రాలను ఆదిలోనే పక్కకు పెట్టే వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ ఆస్తులు సంరక్షణ, పర్యవేక్షణ ఇకపై సులువుగా ఉంటుంది.

- రవికుమార్‌, సదాశివనగర్‌ ,తాసిల్దార్‌, కామారెడ్డి జిల్లా


logo