మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 20:30:47

రాష్ట్రప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది: మంత్రి సత్యవతి రాథోడ్‌

రాష్ట్రప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది: మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన 30 మంది మహిళలకు రవీంద్రభారతిలో ప్రతిభా పురాస్కారాలు అందజేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహిళా-శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్‌, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మీర్పేట్‌ మేయర్‌ దుర్గ దీప చౌహాన్‌, సంగారెడ్డి మేయర్‌ మంజుశ్రీ, కార్పోరేటర్లు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. ముందుగా ప్రతిభా అవార్డులు సాధించిన అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ మహిళల రక్షణ, సాధికారత కోసం విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. మహిళలు ఏ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారనీ.. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌.. మహిళలకు ఓ తండ్రిలా అండగా నిలుస్తున్నారనీ, అన్ని రంగాల్లోనూ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపిన మంత్రి.. వారికి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో, జీవన విధానంలో మహిళలను గౌరవించుకోవడం భాగమైందన్నారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో, అక్కడ దేవతలు సంచారిస్తారనే నానుడి అక్షరాల నిజమని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా, బోనాల పండుగల్లో దేవతల్ని కొలుచుకునే సంస్కృతి ఉన్నదని ఆయన గుర్తు చేశారు. మహిళలు దేశ సరిహద్దుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో షీ టీమ్స్‌ అద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మహిళలను పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని మంత్రి తెలిపారు. మహిళలను దృష్టిలో ఉంచుకొనే సీఎం సంక్షేమ పథకాలు రూపొందించారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకున్నామని తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో షీ టీమ్స్‌ ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. మహిళల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తెలియజేశారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మహిళలకు ప్రతి రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రులు, జెడ్పీ చైర్‌పర్సన్లుగా, మేయర్లుగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు పొందిన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 


logo
>>>>>>