శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 01:33:04

సరిహద్దులు బంద్‌

సరిహద్దులు బంద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ఆదివారం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో ఉన్న రాష్ట్ర సరిహద్దులన్నీ బంద్‌చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారి నుంచే ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్రంలోకి ప్రవేశించే అన్నిమార్గాల్లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటుచేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన 18 ప్రధాన  చెక్‌పోస్టుల్లో భద్రతా చర్యలు తీసుకొని రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులతోపాటు రవాణాశాఖ, వైద్యారోగ్య సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రలో ఆదివారం కూడా 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 74 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మహారాష్ట్ర సరిహద్దుపై నిఘాను మరింత పెంచారు. బాసర- ధర్మాబాద్‌ మార్గంలో అంతర్రాష్ట్ర రహదారిని పూర్తిగా మూసివేశారు. ఉపాధి కోసం ఖతర్‌ వెళ్లిన 37 మంది ముంబైకి చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో హైదరాబాద్‌కు పయనమయారు. కర్ణాటక సరిహద్దులోని జహీరాబాద్‌ చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వీరిని పోలీసులు నిలిపివేశారు. వారంతా ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు. ఖతర్‌ నుంచి ముంబైకి వచ్చిన తమకు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారని బాధితులు వివరించారు. అనంతరం వీరిని గచ్చిబౌలిలోని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించారు.


logo