శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:06

అరుగు మనది.. అరాచకం వాళ్లది

అరుగు మనది.. అరాచకం వాళ్లది

  • రాజ్యాంగ స్ఫూర్తిని మరిచిన రాష్ట్ర బీజేపీ నేతలు
  • మెరుగైన పాలన అందిస్తున్న ప్రభుత్వంపై
  • బురదజల్లుతూ అజ్ఞానపూర్వక స్టేట్‌మెంట్లు
  • కరోనా నిధులపైనా ఇష్టారీతిన విమర్శలు
  • ఒక్క తెలంగాణకే ఇచ్చినట్టు కలరింగ్‌ 
  • తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై 
  • బహిరంగ చర్చకు బీజేపీ నేతలు సిద్ధమా?

తెలంగాణ భారతదేశంలో ఒక భాగం.  ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్న వాస్తవం ప్రపంచమంతా ఎరిగిందే. ఒక్క 2018-19లోనే వివిధ ట్యాక్సుల రూపంలో తెలంగాణ నుంచి సుమారు రూ.80 వేల కోట్లు కేంద్రం వసూలు చేసింది. కానీ తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా చేసింది శూన్యం. ఇదేందని అడిగితే అంతా దైవాధీనం అంటున్నరు.

అన్విత : తెలంగాణ పల్లెల్లో ఎవరైనా కయిత్కాలోల్లు కనపడితే, ‘అరుగు మనదైనా అరాచకం ఆయనే చేస్తడు’ అంటరు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా అట్లనే చేస్తున్నరు. ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా అధికారమే. అందులో రెండో మాటకు ఆస్కారం లేదు. బీజేపీకి, ఆ పార్టీ నాయకులకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అందులో తప్పులేదు. కానీ ప్రజల జీవితాలను అస్థిరపరచి, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న ప్రభుత్వంపై నిప్పులు చల్లి, అబద్ధాలు, అభూత కల్పనలు జోడించి జనాన్ని ఆగమాగం చేయడం భావ్యంకాదు. భారతదేశం సమాఖ్య వ్యవస్థ. ఇందులో నేనే గొప్పంటే - నేనే గొప్ప అనే మాటకు తావులేదు. తెలంగాణ బీజేపీ కరోనా కట్టడి నిధులు ఒక్క తెలంగాణకు మాత్రమే ఇచ్చిండ్రా? ఈ దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వలేదా? అట్లా ఇచ్చిండ్రని బీజేపీ లీడర్లు నిరూపిస్తే.. ఊరూరు చౌరస్త కాడ చెవ్వు కోసుకుంటమంటున్నరు తెలంగాణ ప్రజలు. మరి అది నిజంకాకుంటే ఆ పార్టీ నాయకులు ఏం చేస్తరో ప్రజలకు బాజాప్త చెప్తరా? కరోనా కట్టడి నిధులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకు ఇచ్చిండ్రు. అందులో వింతేముంది? బీజేపీ నాయకులకు వారి కార్యశీలన మీద నమ్మకం ఉంటే, వారు తెచ్చామని చెప్తున్న నిధులు వాస్తవమే అయితే.. ప్రజల ముందుకు వచ్చి తెలంగాణ నుంచి తీసుకుపోయిన నిధులెన్ని, తెచ్చిన నిధులెన్నో బహిరంగంగా చెప్పగలరా? నాయకులు మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని మరిచిపోయినట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నింటికీ కేంద్రమే నిధులిస్తున్నదన్నట్టు మాటిమాటికీ అజ్ఞానపూరితమైన స్టేట్‌మెంట్లిస్తున్నరు. 

తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం

బీజేపీ నాయకుల బడాయి స్టేట్‌మెంట్ల సంగతి పక్కన పెట్టి వాస్తవం ఒకసారి మాట్లాడుకుందాం. తెలంగాణ భారతదేశంలో ఒక భాగం. ప్రతీ ఏటా తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల నిధులు కేంద్రానికి చేరుతున్న మాట వాస్తవం. 2018-19లోనే వివిధ ట్యాక్సుల రూపంలో తెలంగాణ నుంచి సుమారు రూ.80 వేల కోట్లు కేంద్రం వసూలు చేసింది. కానీ తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా చేసింది శూన్యం. ఇదేందని అడిగితే దైవాధీనం అంటు న్నారు. దైవంలాంటి రాజ్యాంగమే ఇవ్వాలని శాసనం చేసినప్పుడు మోకాలడ్డటం ఎంత వరకు న్యాయం? రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడ్డ తెలంగాణ ప్రభుత్వంగానీ, దాని నాయకత్వంగానీ ఎక్కడా గీతదాటి స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని రాజకీయం కోసం వాడుకోలేదు. కానీ రాష్ర్ట బీజేపీ నాయకులు మాత్రం పదేపదే మేమే ఇచ్చాం, మేమే తెచ్చామంటూ ఏ బాటమీద చూసినా పోతురాజులై ఆడుతున్నరు. వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో చెల్లిస్తున్న తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టే కేంద్రం నిధులు సమకూరుస్తుంది. అంతకు మిక్కిలి నయాపైస ఇవ్వడం లేదు. మిషన్‌ కాకతీయకు నిధులడితే అప్పు తీసుకొమ్మంటరు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయమంటే మీనమేషాలు లెక్కిస్తరు, పేదోడికి గుక్కె డు నీళ్లిచ్చే మిషన్‌ భగీరథకు ఓ చెయ్యి వెయ్యమంటే.. చేతులెత్తి సూర్య నమస్కరం చేసిండ్రు. ఇక పింఛన్ల కథ మరో ఎత్తు.. ఇప్పటిదాక ‘మొగున్ని కొట్టి మొగసాలకెక్కిందనే’ సామెత వినడమే కానీ చూసే భాగ్యం దక్కలే.. కానీ కమల దళం దయవల్ల ప్రత్యక్షంగా చూసే అవకాశం చిక్కింది. ఈ దేశంలో పెన్షన్లు భిక్షకాదు.. రాజ్యాంగం చెప్పిన జీవించే హక్కని గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌. అభాగ్యులు, అనాథలు పింఛన్‌తో నెలంతా బతకాలనే ఆలోచనతో.. రూ.200 ఉన్న పింఛన్ను రూ. 2016కి తీసుకుపోయిండు, 500 ఉన్న పింఛన్ను రూ. 3016కు తీసుకుపోయిండు. ఇందులో కొన్ని పింఛన్లలో ఓ 200 రూపాయలు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణకు ఇస్తుంది. కానీ బీజే పీ నాయకులు ఇదంతా వదిలేసి ‘ఇరుస సంచిలో ఓ ఇత్తేసినం.. నా పొత్తేందో చెప్పవా..?’ ‘పేరు మార్చి ఏమార్చుతావా?’ అంటూ డర్టీ పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నరు. 

కాషాయ దళపతికే చెల్లింది

ఇదే అబద్ధాల బండి ఈ మధ్య రేషన్‌ బియ్యం కూడా మాదే అంటూ కొత్త పాట అందుకుంటున్నరు. రాష్ట్రాలకు ఆహారధాన్యాల సరఫరా అనేది పార్లమెంట్‌ తెచ్చిన ఆహార భద్రతా చట్టం-2013లో ఒక భాగం. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకు ఇస్తున్నారన్న ‘నగ్న’సత్యం తెలుసుకోకుండా ఊగిపోవడం ‘కాషాయ’ దళపతికే చెల్లింది. ఆహార భద్రతా చట్టం-2013 కింద కేంద్రం ఇస్తున్నది 60% అర్హులకే. మిగతా 40% అర్హులకు తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఇస్తున్నదన్నది నిజం కాదా? మీరు నిజంగానే సిపాయిలు అయితే అర్హులందరికీ పూర్తిగా బియ్యం ఇప్పించండి గొప్పగా ఉంటది. అంతేకానీ చౌకబారు విమర్శలు చేసి, పనిచేసే ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజల్లో అపరిపక్వులుగా మిగిలిపోవడం సహేతుకమా? 

నిధుల లెక్క బాజాప్త చెప్తారా?

ఇక కరోనా నిధుల విషయంలోనూ కాషాయ లీడర్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. ప్రజలు తెల్వక అడుగుతున్నరు.. కరోనా కట్టడి నిధులు ఒక్క తెలంగాణకు మాత్రమే ఇచ్చిండ్రా? ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేదా? అట్లా ఇచ్చిండ్రని బీజేపీ లీడర్లు నిరూపిస్తే.. ఊరూరు చౌరస్తా కాడ చెవ్వు కోసుకుంటమంటున్నరు తెలంగాణ ప్రజలు. మరి అది నిజంకాకుంటే ఆ పార్టీ నాయకులు ఏం చేస్తరో బాజాప్త చెప్తరా? కరోనా కట్టడి నిధులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకు ఇచ్చిండ్రు. అందులో వింతేముంది? బీజేపీ నాయకులకు వారి కార్యశీలన మీద నమ్మకం ఉంటే, వారు తెచ్చామని చెప్తున్న నిధులు వాస్తవమే అయితే.. ప్రజల ముందుకు వచ్చి తెలంగాణ నుంచి తీసుకుపోయిన నిధులెన్ని, తెచ్చిన నిధులెన్నో బహిరంగంగా చెప్పగలరా? తెలంగాణలో నీటిపారుదలకు ప్రభు త్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందని సమాచారం.. అందులో కేంద్రం ఇచ్చింది అనవాయితీగా వస్తున్న నిధులే తప్ప కొత్తగా ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం తన రెక్కల కష్టంతో ఇస్తు న్న రైతుబంధు, పెన్షన్ల గురించి బీజేపీ నాయకులు ఎక్కువ మాట్లాడకుండా ఉండటమే నైతికమనే భావన ప్రజల్లో స్పష్టంగా ఉన్నది. తెలంగాణలో ఏ పథకం పెట్టినా కేంద్రం నిధులంటున్నరు.. తెలంగాణ ఏమన్నా భారతదేశం అవతలి రాష్ర్టమా? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆ పథకాలు అన్ని రాష్ట్రా ల్లో అమలవుతాయి. అందులో బీజేపీ గొప్పేంది? అది కమ్యూనిస్టులు ఉన్నా అయితయి, కాంగ్రెసోళ్లు ఉన్నా అయితయి. నిజంగా బీజేపీ నాయకులకు అంత పతారే ఉంటే కోటా ప్రకారం రావల్సిన ఎరువులను సకాలంలో విడుదల చేయించారా? లేక కరోనా కష్టకాలంలో ఉన్న రా ష్ట్రానికి  రావాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయించా రా? అప్పు తీసుకోవడానికి పెట్టిన ఆంక్షలను తెలంగాణ వరకు ఏమన్నా తగ్గించారా? రాష్ట్రానికి చేయాల్సిన ఏ ఒక్క మే లు చేయకుండా రాష్ర్టం అమలుచేస్తున్న పథకాల కీర్తిని అ ప్పనంగా మింగే ప్రయత్నం చేయడం విద్రోహం కాదా?

కోచ్‌ ఫ్యాక్టరీ ఏమైంది?

రాష్ర్ట విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఒక రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ రావాలి. అధికారంలో లేనప్పుడు.. కోచ్‌ ఫ్యాక్టరీ కోసం కమలం నేతలు టెంట్లేసుకొని ఉద్యమాలు చేసిండ్రు. ప్రజలు నమ్మి నాలుగు సీట్లిచ్చిండ్రు. తీరా సీటెక్కినాక కమ లం పువ్వు కాస్త పొద్దుతిరుగుడు పువ్వులెక్క ముఖం తిప్పేస్తున్నది. ఓట్లదాక కోచ్‌ ఫ్యాక్టరీ అన్నోళ్లు.. ఇప్పుడు ‘వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌' అంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నరు. వీళ్ల లెక్క ఎట్లుందంటే.. కార్ల తయారీ కర్మాగారం ఇస్తమని చెప్పి.. కార్లు కడిగే సర్వీసింగ్‌ సెంటర్‌ పెడతమంటున్నరు. నిజామాబాద్‌లో పసుపు బోర్డ్‌ తెస్తమన్నరు. ఓట్లెయ్యుండ్రి గెలిచినంక ఫస్ట్‌ పని అదే అంటూ తొడకొట్టిండ్రు, రైతుల ఆవేదనను ఓట్ల సమరుగా వాడుకున్నరు. తీరా, ఓట్లేసి గెలిచినంక యేడాదిపైకాలానికి సావు కబురు సల్లగా చెప్తూ స్పైస్‌ బోర్డ్‌ పెట్టి రైతులకు గుండెకోతను మిగిల్చిండ్రు. రైతన్నల ఆశల్ని అడియాశలు చేసిం డ్రు. ఆనాటి నుంచి ఈనాటిదాక కన్నీళ్లను, గోసను కూడా మోసం చేసి వాడుకోవడంలో అంతా అరవింద పరివారమే కదా.. అందులో ఆశ్చర్యానికి తావేలేదు. దీని గురించి అబద్ధాల జట్కాబండి ఎన్నడు మాట్లాడదే.

సమాఖ్య స్ఫూర్తికి తూట్లు

ఎంతసేపు రాష్ర్టప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు పేరు పెట్టుకోవాలనే ఆశే తప్ప.. ప్రత్యేకంగా తెలంగాణకు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మేలేంది.? ఇవన్నీ విడిచి రాష్ట్రాల అధికారాల్ని గుంజుకుంటమని తెగేదాక లాగితే ఎట్లా? సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న బీజేపీ వైఖరి ఇలాగే కొనసాగితే నాడు ఎన్టీఆర్‌ చెప్పినట్టు రాష్ట్రాలు ఉమ్మడిగా మారి కేంద్రం మిథ్యగా మిగిలే ప్రమాదం రాదనుకుందామా? ఇప్పటికైనా బీజేపీ నాయకులు తెలంగాణ భారతదేశంలోనే ఉందని గ్రహించాలి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే నిధులు ఇస్తున్నరని.. ప్రత్యేకంగా తెలంగాణకు ఒరిగింది, జరిగింది ఏమీ లేదని గ్రహించాలి. శుష్కప్రియాలు-శూన్య హస్తాలు మాని ప్రత్యేకంగా నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారనే సంగతిని గుర్తెరగాలి. లేదంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజల చేతిలో మరోసారి భంగపాటు తప్పదు.


logo