బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 01:52:36

సోనా.. నిజంగా బంగారమే

సోనా.. నిజంగా బంగారమే

  • షుగర్‌ పేషెంట్లకు అనుకూలం.. 
  • మన వరి వంగడానికి రాష్ర్టాల్లో భారీ డిమాండ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ సృష్టించిన తెలంగాణ సోనా వరి వంగడం పేరుకు తగ్గట్టుగానే నిజంగా బంగారమే. టైప్‌-2 మధుమేహంతో బాధపడే వారికి వరంగా మారింది. సాధారణ బియ్యం కంటే భిన్నంగా చిరు ధాన్యాల్లో ఉండేస్థాయిలోనే కార్బోహైడ్రేట్స్‌ ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సంస్థ కూడా పరిశోధించి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో ఈ వంగడం దేశంలోని పలు రాష్ర్టాల రైతుల ఆదరణ పొందింది. తెలంగాణ సోనా లైసెన్స్‌కోసం ఇతర రాష్ర్టాల వరి విత్తన వ్యాపారులు జయశంకర్‌ వర్సిటీని ఆశ్రయిస్తున్నారు. 

ఈ వంగడానికి అంతర్జాతీయస్థాయిలోనూ గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ జర్నల్‌లోనూ దీనిపై కథనం ప్రచురితమైంది. తక్కువ కార్బోహైడ్రేట్స్‌తో టైప్‌- 2 షుగర్‌ పేషెంట్లకు ఈ వంగడం అనుకూలంగా ఉంటుంది. గ్లూకోజ్‌ 51.6% మాత్రమే ఉండటం వల్ల తెలంగాణ సోనా వరి అన్నం తినేవారికి షుగర్‌ వచ్చే అవకాశాలుండవు. ఇతర వరి వంగడాల్లో గ్లూకోజ్‌ శాతం 55% నుంచి 62% వరకు ఉంటుంది. సాంబా మసూరి వంటి పంట పండించడానికి 155 నుంచి 160 రోజుల సమయం పడితే, తెలంగాణ సోనాకు 125 రోజులు సరిపోతుంది. 

దిగుబడి కూడా ఇతర వంగడాల కంటే 5% నుంచి 10% ఎక్కువ రావడం విశేషం. సాంబా మసూరి ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తే, తెలంగాణ సోనా 28 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఈ వరి వంగడాన్ని రెండు సీజన్లలోనూ పండించుకోవచ్చు. తక్కువ రోజుల్లో దిగుబడి రావడంతో పంటకు పంటకు మధ్యలో జనుము, పిల్లి పెసర, పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల భూమి సారవంతమవుతుంది. ఎరువుల వినియోగం, ఖర్చు కూడా తగ్గుతుంది.


logo