శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:45

మూసివేత దిశగా స్టార్టప్స్‌

మూసివేత దిశగా స్టార్టప్స్‌

స్టార్టప్‌లనూ కరోనా వైరస్‌ తాకిడి తగిలింది.. కరోనా పరిస్థితుల్లో వందలాది సార్టప్‌లు మూతపడేస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే 12శాతం మూతపడగా.. కేంద్రం పట్టించుకోకపోతే దాదాపు 70 శాతం ఉనికి ప్రశ్నార్థకంగా మారవచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్నిరంగాలను ప్రభావితం చేసినట్టే స్టార్టప్‌లపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్నది. దాదాపు 70 శాతం స్టార్టప్‌లు కరోనా కారణంగా కోలుకోలేకుండా పోతున్నాయి. 12 శాతం స్టార్టప్‌లు మూతపడగా.. చాలా సంస్థలు కార్యాలయ నిర్వహణతోపాటు సిబ్బంది జీతాలను తగ్గించుకున్నాయి. స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు వెనక్కి తగ్గుతున్నారు. కేంద్రం భారీప్యాకేజీ ప్రకటించి స్టార్టప్‌లను ఆదుకోవాలని, లేకుంటే ఇంకా పెద్ద సంఖ్యలో మూతపడే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. 

‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ కొవిడ్‌-19 ఆన్‌ ఇండియన్‌ స్టార్టప్స్‌' అనే అంశంపై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కి), ఇండియన్‌ యాంగిల్‌ నెట్‌వర్క్‌(ఐఏఎన్‌) దేశ వ్యాప్తంగా 250 స్టార్టప్‌లు, 61 ఇంక్యుబెటర్‌లపై జూన్‌లో సర్వే నిర్వహించాయి. 70 శాతం స్టార్టప్‌లపై కరోనా ప్రభావం చూపిందని సర్వే వెల్లడించింది. 33 శాతం స్టార్టప్‌లకు పెట్టుబడి సాయం చేద్దామనుకున్నవారు కూడా పునరాలోచనలో పడ్డారని తేలింది. 60 శాతం స్టార్టప్‌లు వ్యాపారపరమైన నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 68 శాతం వాటిలో అత్యధికంగా ఆఫీస్‌, సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకున్నాయి. లాక్‌డౌన్‌ ఇంకా పొడిగిస్తే 30 శాతం సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. 43 శాతం సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల వేతనాలను 20 నుంచి 40 శాతం కట్‌ చేస్తున్నాయి.

హెల్త్‌కేర్‌ స్టార్టప్‌లపై ఆసక్తి

స్టార్టప్‌లపై పెట్టుబడి పెట్టేవారిలో 35 శాతం హెల్త్‌కేర్‌ స్టార్టప్‌లపై పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కృతిమ మేధస్సు, విద్యలో సాంకేతిక అంశాలు, అగ్రికల్చర్‌, ఇతర టెక్నాలజీ స్టార్టప్‌లపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సర్వేలో తేలింది. పెట్టుబడులపరంగా సర్వేలో 33 శాతం సంస్థల్లో తమ పెట్టుబడుల నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 10 శాతం సంస్థల్లో పెట్టుబడులను పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నారు. కరోనాకు ముందు పెట్టుబడులు పెట్టినవాళ్లు 8 శాతం సంస్థల్లో ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. 96 శాతం పెట్టుబడులపై కరోనా ప్రభావం పడిందని పెట్టుబడుదారులు సర్వేలో వెల్లడించారు. 44 శాతం ఇంకుబేటర్లకు రోజువారీ నిర్వహణపై ప్రభావం చూపింది.

ఫిక్కీ, ఐఏఎన్‌ సర్వేలోని ముఖ్యాంశాలు

మూతపడ్డ స్టార్టప్‌లు 
12%
వేతనాలు తగ్గించిన సంస్థలు
 43%
ఉద్యోగులను తొలిగించేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలు 
30%
ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు 
70%
నిర్వహణ వ్యయం తగ్గించిన సంస్థలు
68%


logo