శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:13:56

12 నగరాలకు కొవాగ్జిన్‌

12 నగరాలకు కొవాగ్జిన్‌

  • భారత్‌ బయోటెక్‌ టీకాల సరఫరా ప్రారంభం
  • కేంద్రానికి ఉచితంగా 16.5 లక్షల డోసులు
  • దవాఖాన పారిశుద్ధ్య కార్మికులకే తొలి టీకా
  • కరోనా కాలంలో సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

హైదరాబాద్‌, జనవరి 13 (నమస్తే తెలంగాణ): భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా పంపిణీ బుధవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 55 లక్షల కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. తొలివిడుతగా దేశవ్యాప్తంగా 12 నగరాలకు పంపిణీ చేసినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా మిగతా 11 నగరాలకు విమానాల్లో టీకాలను చేర్చినట్టు పేర్కొంది. ఏపీలోని గన్నవరం, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కురుక్షేత్ర, గువాహటి, పాట్నా, పుణె, భువనేశ్వర్‌, జైపూర్‌, లక్నోకు విమానాల్లో సరఫరా చేసినట్టు తెలిపింది. త్వరలోనే మొత్తం డోసులను సరఫరా చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్‌కు 20వేల డోసులు పంపిణీ చేసినట్టు తెలిసింది. తాము సరఫరాచేస్తున్న ఒక్కో వయల్‌లో 20 డోసులు ఉంటాయని పేర్కొంది. మొత్తం 55 లక్షల డోసుల్లో 16.5 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వానికి ఉచితంగా అందజేసినట్టు తెలిపింది. కరోనా వైరస్‌కు మొట్టమొదటి స్వదేశీ టీకాను పంపిణీ చేయడాన్ని సంస్థ ఓ మైలురాయిగా అభివర్ణించింది. కొవాగ్జిన్‌ను తయారు చేయడంలో సహకరించిన దేశ ప్రజలకు, ప్రభుత్వాలకు, వలంటీర్లకు, పరిశోధన భాగస్వాములకు ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ కృతజ్ఞతలు తెలిపింది. logo