శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Mar 24, 2020 , 01:36:15

గడప దాటని గ్రామం

గడప దాటని గ్రామం

  • పల్లెల్లో నిలిచిపోయిన ప్రజారవాణా
  • ఊర్లోకి రావాలంటే సర్పంచ్‌, కార్యదర్శి అనుమతి తప్పనిసరి
  • 32 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో పరిశుభ్రత పనులు
  • విదేశాల నుంచి గ్రామాలకు 230 మంది వచ్చినట్టు గుర్తింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో ప్రజారవాణా నిలిచింది. గ్రామాల ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులకు సైతం దూరంగా ఉన్నారు. వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. అత్యవసరాలు లేకపోవడంతో రైతులు పొలానికి వెళ్లలేదు. ప్రభుత్వం సెలవులివ్వడంతో ఇంటిల్లిపాదీ ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. గ్రామాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి మస్కూరిలతో కాపలా పెట్టారు. సర్పంచ్‌, కార్యదర్శి అనుమతి లేనిదే గ్రామంలోకి కొత్తవారిని రానీయడంలేదు. మరోవైపు విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారిని గుర్తించిన పంచాయతీ సిబ్బంది.. వారిని ఇండ్ల నుంచి బయటకు రానీయకుండా చూస్తున్నారు. ఆదివారం మొదలైన జనతా కర్ఫ్యూ తరహాలోనే గ్రామాల్లో కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామాల్లోకి అత్యవసరమైతే తప్ప వాహనాలను అనుమతించడం లేదు. 

యుద్ధంలా పారిశుద్ధ్య పనులు

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు జోరందుకున్నాయి. ఉద యం, సాయంత్రం వీధులను పరిశుభ్రం చేస్తున్నారు. దాదాపు 32వేల మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉంటున్నారు. పెద్దగ్రామాలు, పట్టణాల్లో 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. బైక్‌లపై తిరిగేవారిని పట్టుకొని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇండ్లుదాటి బయటకు రావద్దని ప్ర చారంచేస్తున్నారు. ఇప్పటికే వారాంతపు సంతలు, మార్కెట్లుమూతపడ్డాయి. గ్రామంలోకి కొత్తవారు ఎవ రువచ్చినా వెంటనే సమాచారమివ్వాలని జిల్లా అధికారులు గ్రామ సచివాలయాలకు సమాచారమిచ్చారు. గత పదిరోజుల వ్యవధిలో ఇతరరాష్ర్టాల నుంచి 3,546 మంది వచ్చినట్టు పంచాయతీ అధికారులు గుర్తించారు. దాదాపు 230 మంది విదేశాల నుంచి గ్రామాలకు వచ్చినట్టు తేలింది. వీరికి నిత్యం ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నట్టు జిల్లా అధికారులు చెప్తున్నారు. 


logo