మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:32:42

ఎల్‌ఆర్‌ఎస్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ఎల్‌ఆర్‌ఎస్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

  • సుస్థిరాభివృద్ధికే ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు
  • ఆ మేరకు చట్టాల్లోనూ మార్పులు చేశాం
  • ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదన 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై స్టే ఇవ్వడానికి మరోమారు హైకోర్టు నిరాకరించింది. స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అంగీకరించలేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను రద్దు చేయాలని, ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని వేర్వేరు అభ్యర్థనలతో దాఖలైన పిల్స్‌, రిట్‌ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. గతంలోనూ ప్రభుత్వాలు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలు తీసుకొచ్చాయని, రుసుములు చెల్లించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. 

అక్రమ లే-అవుట్లు లేకుండా చేసేందుకే.. 

భవిష్యత్తులో మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ ఉండబోదని, చివరి అవకాశం కింద అన్ని అక్రమ లే-అవుట్లకు అవకాశం ఇస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. నియమబద్ధ భూపరిపాలన, సుస్థిరాభివృద్ధి కోసమే చివరి అవకాశంగా ప్రభుత్వం ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ లే-అవుట్లు లేకుండా చేసి.. ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. భవిష్యత్తులో అక్రమ లే-అవుట్లు, ప్లాట్లు ఉండబోవని తెలిపారు. అక్రమ లే-అవుట్లు ఉన్న వారందరూ క్రమబద్ధీకరించుకోవాలని, లేనిపక్షంలో మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. అనుమతి లేని లే-అవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తూ ప్రభుత్వ మెమో జారీచేసిందని తెలిపారు. అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈనెల 11న కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విచారణ 12కు వాయిదా పడింది.