మనలో ఉన్న ధైర్యాన్ని
మనలో ఉన్న బలాన్ని
ఎప్పుడో ఎవరో లోనుండి తోడేశారు
మనలో ఇంకేం మిగిలుందని
బతుకు పోరాటం చేస్తాం!
ఇంకిపోయినా ఊరడం నేర్పే
దాహం తీర్చే ప్రకృతి పాఠం నేర్వాలి!
కొందరి గొప్పలకోసం
ఎన్నో జీవులు నలిగిపోతాయి
కొందరి మెప్పుల కోసం
ఎన్నో హృదయాలు నీరుగారి పోతాయి,
ఈ యాంత్రిక కుతంత్రాల మధ్య
మనసులను ఏనాడో హత్య చేశారు
ఇప్పుడు దేహమొక్కటే మిగిలుంది!
మోడుబారినా మళ్లీ చిగురించే
ప్రకృతి పాఠం నేర్వాలి!
చదువుకోసం పరుగులు
పనులకోసం పరుగులు
బాధ్యతలకోసం పరుగులు
ఒకరిని చూసి మరొకరు పరుగులు
మనకోసం మనం నడిచిందెన్నడు
స్వేచ్ఛగా ఊపిరి పీల్చిందెన్నడు
ఈదురు గాలికి కొట్టుకుపోయినా
ఎదురీదే శక్తినిచ్చే ప్రకృతి పాఠం నేర్వాలి!
చస్తూ బతకడమెలాగో నేర్చుకున్నాం
మనకు మరణమేం కొత్త కాదు
కానీ మనకోసం ఎదురుచూసే
మనమీద ఆధారపడే వారికోసం
మనకు మనమే యుద్ధానికి సిద్ధమవుదాం!
గూటిలోని పక్షులమైనా
అల్లుకున్న కొమ్మలతో నిలబడదాం!
స్వేచ్ఛగా ఎగిరే కాలం.. హాయిగా నవ్వే కాలం
మున్ముందు మనకోసం సిద్ధంగా ఉంది
పోయిన కాలాన్ని రాబట్టుకునేందుకు
ఉన్నకాలాన్ని జాగ్రతగా వాడుకుందాం
ఎప్పటికైనా శాస్త్రమే మన అస్త్రం
రెండడుగులు వెనకబడినా
మనిషెప్పుడూ గెలుపు జీవే!
పుట్టి గిరిధర్, 9491493170