e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home తెలంగాణ ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు

ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు

  • గ్రానైట్‌ ఎగుమతుల్లో పొకర్ణ టాప్‌
  • 12 దేశాలకు కంపెనీ ఉత్పత్తులు
  • రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్లాంట్లు
  • వ్యవసాయం, పరిశ్రమలు సమాన వృద్ధి
  • పట్టణం.. పల్లెల్లో సమతుల ప్రగతి
  • సమర్థ నాయకత్వం- సుస్థిర ప్రభుత్వం
  • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి
  • షాద్‌నగర్‌లో పొకర్ణ గ్రానైట్‌ పరిశ్రమ ప్రారంభం

నేడు క్యాబినెట్‌ సమావేశం

రాష్ట్ర క్యాబినెట్‌ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నది. ఈ సందర్భంగా దళిత బంధుపై చర్చించే అవకాశం ఉన్నది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, నూతన మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. వీటితోపాటు గత క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు.

హైదరాబాద్‌, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది సాధ్యమవుతున్నదని చెప్పారు. షాద్‌నగర్‌ నియెజకవర్గంలోని మేకగూడలో పొకర్ణ ఇంజినీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ సంస్థ నెలకొల్పిన అత్యాధునిక క్వాంట్రా క్వార్ట్‌ గ్రానైట్‌ ప్లాంటును మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వటంలో తెలంగాణ రాష్ట్రం విప్లవమే తెచ్చిందని అన్నారు. పారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికి, ఉపాధి కల్పనతోపాటు వ్యవసాయం, కులవృత్తుల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యయసాయం, పారిశ్రామికీకరణ సమ్మిళితంగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. టీఎస్‌ ఐ-పాస్‌ విధానంతో రాష్ట్రంలో పరిశ్రమ స్థాపనను అత్యంత సులువుగా మార్చామని గుర్తుచేశారు. పరిశ్రమ పెట్టాలంటే ఎటువంటి అనుమతులు అవసరం లేదని, దరఖాస్తుచేసుకొని నిర్మాణం చేపట్టవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ వ్యాపారాలు నడుస్తున్నాయో ప్రభుత్వానికి తెలిసేందుకు మాత్రమే దరఖాస్తు అవసరమవుతున్నదని పేర్కొన్నారు. దరఖాస్తుచేసిన 15 రోజుల్లో అనుమతులు రాకుంటే 16వ రోజునుంచి అనుమతి మంజూరైనట్టే భావించాల్సి (డీమ్డ్‌ అప్రూవల్‌) ఉంటుందని వివరించారు. పరిశ్రమల అనుమతి మంజూరులో అకారణంగా జాప్యం చేసిన అధికారికి రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని చెప్పారు. ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. 2015 నవంబర్‌లో టీఎస్‌ ఐ-పాస్‌ చట్టం అమల్లోకి రాగా, గడచిన ఏడేండ్లలో 15 వేల పరిశ్రమలు, రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వీటిద్వారా 15 లక్షల పైచిలుకు మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

స్థానికులకు ఉద్యోగాలివ్వండి

- Advertisement -

అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన పొకర్ణ గ్రానైట్‌ పరిశ్రమను చూస్తుంటే భారతదేశంలో ఉన్నామా, యూరప్‌లో ఉన్నామా తెలియటంలేదని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. రూ.500 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ సంస్థలో పర్యావరణ పరిరక్షణనను కూడా గమనంలోకి తీసుకొని రూ.15-20 కోట్లతో జీరో లిక్విడ్‌ డిశ్చార్జి ప్లాంటును నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ నిర్మించడం చిన్న విషయం కాదని పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. కనీస సౌకర్యాలైన నీరు, విద్యుత్తు సరఫరా 24 గంటలూ నిరాటంకంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

స్థానిక యువత, మహిళలకు ఉపాధి

పొకర్ణ సంస్థ ఇప్పటికే వస్త్ర పరిశ్రమలో కూడా ఉన్నందున షాద్‌నగర్‌లో ఒక వస్త్ర పరిశ్రమను ఏర్పాటుచేసి స్థానిక యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. వస్త్ర పరిశ్రమ పెడతామంటే అన్నిరకాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఇక్కడ వస్త్ర పరిశ్రమ పెట్టి రెండుమూడు వేల మంది స్థానికులకు ఉపాధి కల్పించేలా చూడాలని కోరారు. నైపుణ్యంగల ఉద్యోగులను ప్రభుత్వం తయారుచేసి ఇస్తుందని తెలిపారు. గ్రానైట్‌ ప్లాంటును విస్తరించి మరింత మందికి ఉపాధి కల్పించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొకర్ణ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌చంద్‌ జైన్‌తో కలిసి పరిశ్రమను పరిశీలించారు. గ్రానైట్‌ తయారీ విధానంపై అక్కడి ఇంజినీర్లతో ముచ్చటించారు. ఉద్యోగుల్లో స్థానికులు ఎందరున్నారో అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి జనార్దన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana