శనివారం 06 జూన్ 2020
Telangana - May 07, 2020 , 02:20:02

శ్రీశైలం నుంచి ఏపీ సర్కారు ఎత్తిపోత

శ్రీశైలం నుంచి ఏపీ సర్కారు ఎత్తిపోత

 • కృష్ణా నదీ జలాల లిఫ్టింగ్‌కు  ప్రణాళిక
 • రోజుకు 6 నుంచి 8 టీఎంసీలు తరలింపు
 • సంగమేశ్వరం వద్ద పంపింగ్‌ స్టేషన్‌
 • 80 వేల క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు
 • 6,829 కోట్లతో పరిపాలనా ఆమోదం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీల కృష్ణాజలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక రచించింది. ఇందుకోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంతోపాటు, పోతిరెడ్డిపాడు, ఇతర కాల్వల ప్రవాహ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించి రూ.6,829.15 కోట్ల విలువైన పనులకు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ ఆ రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ రెండ్రోజుల క్రితం జీవో విడుదలచేశారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించేందుకు ఇప్పటికే మూడు వ్యవస్థలు ఉన్నాయి. 44 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో (గ్రావిటీపై) పోతిరెడ్డిపాడుతోపాటు, శ్రీశైలం ఫోర్‌షోర్‌లో కేసీ కెనాల్‌ లిఫ్టు కింద నాలుగు మోటర్లు, ముచ్చుమర్రి లిఫ్టు స్కీం కింద మరో 12 మోటర్ల ద్వారా ఎత్తిపోతలు నిర్వహిస్తున్నారు.

శ్రీశైలం జలాశయంలో 841 అడుగుల స్థాయివరకు నీటిని తరలించేలా పోతిరెడ్డిపాడు ఉండగా.. ముచ్చుమర్రి 799 అడుగుల వరకు ఉన్నా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నది. ఇలా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు సుమారు నాలుగున్నర టీఎంసీలను రాయలసీమకు తరలించే వ్యవస్థలు ఉన్నాయి. అయితే దీనిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీలకు పెంచాలని నిర్ణయించిన ఏపీ జల వనరులశాఖ.. రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు, ఇప్పటికే ఉన్న వ్యవస్థలను మరింత విస్తరించేందుకు రూ.7,045.06 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.6,829.15 కోట్ల అంచనాతో ఆమోదం తెలుపుతూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 

మూడు టీఎంసీల ఎత్తిపోతతో రాయలసీమ లిఫ్టు

 • శ్రీశైలం ఫోర్‌షోర్‌ నుంచి రోజుకు మూడు టీఎంసీలు లిఫ్ట్‌చేసి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ దిగువన నాలుగో కిలోమీటర్‌ వద్ద శ్రీశైలం కుడి ప్రధానకాల్వలో పోసేలా రాయలసీమ లిఫ్టు పథకాన్ని రూపొందించారు. ఇందుకోసం సంగమేశ్వరం పాయింట్‌ వద్ద మూడు టీఎంసీల జలాల లిఫ్టునకు సంబంధించి పంపింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు. దీనికి సంబంధించిన అప్రోచ్‌చానల్‌, మోటర్లు, ఇతరత్రా పనులను రూ.3,825 కోట్లతో చేపట్టనున్నారు. 
 • ప్రస్తుతం 44 వేల క్యూసెక్కులుగాఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ డిశ్చార్జి సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. ఆ మేరకు శ్రీశైలం కుడి ప్రధానకాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా విస్తరించేందుకు లైనింగ్‌, ఇతరత్రా పనులు చేపట్టనున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చిన జలాలను మూడుమార్గాల్లో విభజించి తరలించే పాయింట్‌ (బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌) సామర్థ్యాన్ని కూడా 80 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. ఈ పనులతోపాటు, తెలుగుగంగ గేట్లు, శ్రీశైలం కుడి గట్టుకాల్వ (ఎస్సార్బీసీ) ఇంప్రూవ్‌మెంట్‌ పనులను రూ.570.45 కోట్లతో చేపట్టనున్నారు.
 • శ్రీశైలం కుడిగట్టు కాల్వతోపాటు గాలేరు-నగరి సుజల స్రవంతి కాల్వలను గోరకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు లైనింగ్‌చేసి వాటి ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను రూ.939.65 కోట్లతో చేపట్టనున్నారు. 
 • గోరకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబంధించిన అప్రోచ్‌, లీడింగ్‌ చానళ్లతోపాటు రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కుల స్థాయికి పెంచే పనులను రూ.36.95 కోట్లతో చేపట్టనున్నారు. 
 • గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు ఎస్సార్బీసీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వల ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 30 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచే పనులను రూ.1,457.10 కోట్లతో చేపట్టనున్నారు.

  రాయలసీమతో జలాల తరలింపు అక్రమం

 • తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్‌
 • శ్రీశైలం నుంచి రోజుకు పది టీఎంసీల జలాలను తరలించేందుకు ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్‌ (ట్రీ) స్పష్టంచేసింది. ఈ మేరకు ట్రీ అధ్యక్షుడు సంగం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఈ ఎత్తిపోతలతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు అనుమతిస్తూ జారీచేసిన జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాలరాసేందుకు తెచ్చిన ఈ ఉత్తర్వులు కుట్రపూరితమన్నారు. ఇప్పటికే దాదాపు 1.15 లక్షల క్యూసెక్కులను తరలించేలాఉన్న పోతిరెడ్డిపాడుద్వారా ఒక నదీజలాల్ని మరో నదీ పరీవాహకప్రాంతానికి తరలించడం విడ్డూరమని పేర్కొన్నారు.


logo