శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 03:00:14

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

  • కాళేశ్వరం దగ్గర ఉరకలేస్తున్న గోదావరి  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: కృష్ణా బేసిన్‌లో ఎగువన వరద కాస్త తగ్గినా.. తెలుగు రాష్ర్టాల పరిధిలోని కృష్ణా పరివాహకంలో కురిసిన వర్షాలు కలిసొచ్చాయి. ఆల్మట్టి, నారాయణపుర నుంచి ఇన్‌ఫ్లో తగ్గినా శ్రీశైలానికి వరద కొనసాగుతున్నది. నాలుగు రోజుల కిందటి వరకు ఆల్మట్టికి 50 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది.  కానీ మూడు రోజులుగా వరద తగ్గుముఖం పట్టింది. 17 నుంచి 20 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే వస్తుండటంతో నారాయణపుర నుంచి కూడా దిగువకు 15 వేల క్యూసెక్కుల లోపు వస్తున్నది. ఈ క్రమంలో జూరాలకూ వరద తగ్గడం మొదలైంది. 70 నుంచి 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా శనివారం 55 వేల లోపు క్యూసెక్కులకు చేరింది. ఇదిలావుండగా శ్రీశైలానికి మాత్రం వరద కొనసాగుతున్నది. శనివారం 70 వేలపైచిలుకు క్యూసెక్కులు నమోదైంది. ఇది ఇంకా పెరిగే అవకాశమున్నది. ముఖ్యంగా తుంగభద్ర డ్యాం దిగువన.. అలంపూర్‌, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తుండటంతో శనివారం సుంకేశులకు వరద పోటెత్తింది. శ్రీశైలానికి ఇక్కడి నుంచే 25 నుంచి 30 వేల క్యూసెక్కుల వరకు వరద వస్తున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.  దీంతో ఎగువన ఇన్‌ఫ్లో తగ్గినా.. స్థానిక వర్షాలు తోడవడంతో శ్రీశైలానికి మాత్రం వరద పరిమాణం స్థిరంగా కొనసాగుతున్నది. అటు గోదావరిలో లక్ష్మి బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శనివారం సా యంత్రం కూడా బరాజ్‌కు 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్‌కు మోస్తరుగా 8 వేల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుండగా.. సాగు నీటికోసం దాదాపు అంతేమేర కాల్వలకు వదులుతున్నారు.  
logo