విద్యుత్ కేంద్రంలో విస్ఫోటం

- శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం
- తొమ్మిది మంది దుర్మరణం
- నాలుగో యూనిట్లో పేలిన ప్యానళ్లు, రియాక్టర్లు
- మంటలు, పొగతో నిండిన విద్యుదుత్పత్తి ప్లాంట్
- ప్లాంట్‌ను కాపాడే క్రమంలో సిబ్బంది బలిదానం
- జెన్కోలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
మంటలను గుర్తించగానే అప్రమత్తమయ్యారు. ప్రాణాలు రక్షించకోవడం కన్నా.. జాతి సంపద అయిన విద్యుత్ ప్లాంటును కాపాడేందుకే తపనపడ్డారు. విద్యుత్ నిలిపివేసి, మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నించి.. ఘోర విపత్తును నిలువరించారు. కానీ.. అప్పటికే దట్టమైన పొగలు కమ్ముకుని.. చిమ్మచీకటి అలుముకున్న తరుణంలో ఊపిరాడక నిర్జీవులయ్యారు. ఇది కరెంటోళ్ల బలిదానం! శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో ఒక డీఈ, ఐదుగురు ఏఈలు సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. 23 మంది కొన ఊపిరితో బయటపడ్డారు.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగులంతా గురువారం రాత్రి షిఫ్టులో నిమగ్నమై ఉన్నారు. మూడువారాల మాదిరిగానే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఉన్నట్టుండి రాత్రి 10.30 గంటల సమయంలో ట్రాన్స్ఫార్మర్లు, రియాక్టర్లు, ప్యానళ్లు పేలాయి. భారీఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన ఇంజినీర్లు, సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్లాంటును రక్షించేందుకు మంటలను ఆర్పేందుకు యత్నించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ అప్పటికే మంటలు వ్యాపించడం, చిమ్మచీకటిలో దట్టమైన పొగతో లోపల ఉన్నవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతున్నదో తెలుసుకునేలోపే శ్వాసతీసుకోవడం కూడా కష్టంగా మారింది. కొందరు తమకుతోచిన ఆనవాళ్ల ప్రకారం నేలపై పాకుతూ, గోడలను ఆసరా చేసుకొంటూ కొనఊపిరితో గంట తర్వాత బయటపడ్డారు. తొమ్మిది మంది ప్లాంట్‌లోనే ప్రాణాలొదిలారు.
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ/ అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండ లం ఈగలపెంట పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం ఆర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కేంద్రంలోని నాలుగో యూనిట్‌లోని ప్యానెల్లో చెలరేగిన మంటలు టాన్స్‌ఫార్మర్లు, రియాక్టర్లకు అంటుకున్నాయి. దీంతో ప్లాంట్ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్లాంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇంజినీర్లు, సిబ్బంది తొమ్మిదిమంది మృతిచెందారు. ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. శ్రీశైలం జలాశయానికి ఎగు వ నుంచి పెద్ద ఎత్తున జలాలు వచ్చి చేరుతుండటంతో మూడువారాలుగా ఈ కేంద్రంలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. దీంతో రాత్రి షిఫ్ట్‌ల్లోనూ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం రాత్రి 15 మంది ఇంజినీరింగ్ అధికారులు, అమరరాజా బ్యాటరీ కంపెనీకి చెందిన ఇద్దరితోపాటు, మరో 15 మంది సిబ్బంది ప్లాంట్‌లో ఉన్నారు. ఇంజినీరింగ్ అధికారులు విద్యుదుత్పత్తి విభాగంలో ఉండగా బ్యాటరీ రిపేర్ చేసే విభాగంలో 17 మంది పనిచేస్తున్నారు. సరిగ్గా రాత్రి 10.30 సమయంలో నాలుగో నంబర్ ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే బోర్డు పేలిపోయింది. చూస్తుండగానే మరో ప్యానల్బోర్డుకు మంటలు వ్యాపించాయి. ట్రాన్స్ఫార్మర్లు, రియాక్టర్లు పేలి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పవర్ జనరేషన్ ట్రిప్ అయి, ఆరు యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకవైపు చిమ్మ చీకటి, మరోవైపు దట్టమైన పొగలతో ప్లాంట్‌లోని సిబ్బందికి ఏమి చేయాలో తోచలేదు. శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆ పరిస్థితిలోనే కొందరు నేలపై పాకుతూ, గోడలను పట్టుకుని బయటకొచ్చారు. డీఈ శ్రీనివాస్‌గౌడ్, ఏఈలు వెంకట్రావు, ఫాతిమా బేగం, మోహన్‌కుమార్, సుందర్నాయక్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, అమరరాజా కంపెనీ ఉద్యోగులు వినేశ్‌కుమార్, మహేశ్‌కుమార్ కేంద్రంలోనే ఊపిరాడక మృతిచెందారు.
రెండుగంటల తర్వాత బయటకు..
గురువారం రాత్రి 10:30కు ఈ ఘటన జరుగగా ప్రాణాలతో బయటపడిన ఉద్యోగులు తమ కుటుంబీకులకు, అధికారులకు తెలియజేయడం తో ఈ విషయం అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత బయటకు వచ్చింది. ముందుగా నాగర్‌కర్నూల్ కలెక్టర్ శర్మన్ అక్కడకు చేరుకొన్నారు. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు జలవిద్యుత్ కేంద్రానికి చేరుకొన్నా రు. విషయాన్ని సీఎం కేసీఆర్‌కు ఫోన్లో తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడినా.. ఊపిరాడని స్థితిలో ఉన్న వెంకటయ్య(జేపీఏ), పాల్ వెంకయ్య(డ్రైవర్), పవన్ కుమార్(డీఈ), రామకృష్ణ(జేపీఏ), కృష్ణారెడ్డి (ఆర్టీ జేసీ)లను చికిత్స కోసం జెన్కో దవాఖానకు తరలించగా, వారి పరిస్థితి నిలకడగానే ఉన్నది.
దట్టమైన పొగతో ఇబ్బందులు
జలవిద్యుత్ కేంద్రంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయకచర్యలకు విఘా తం కలిగింది. ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మ ధ్యాహ్నం సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బం ది ఆక్సిజన్ సిలిండర్లతో లోపలకు వెళ్లి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చారు. సాయంత్రం దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. దట్టమైన పొగలతో ప్లాంటులోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం తిరిగి వచ్చాక శ్వాససమస్యలతో బాధపడ్డారు. మృతదేహాలను జెన్కో దవాఖానకు తరలించారు. ప్రమాదం సమయంలో విద్యు త్ సరఫరా నిలిపివేయడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం తప్పింది.
క్షతగాత్రులు
1.వెంకటయ్య (జేపీఏ)
2.పాల్ వెంకయ్య (డ్రైవర్)
3.పవన్ కుమార్ (డీఈ)
4.రామకృష్ణ (జేపీఏ)
5.మత్రు (జేపీఏ)
6.క్రిష్ణారెడ్డి(ఆర్టీజేసీ)
తాజావార్తలు
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,