బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:16

శ్రీశైలం ప్రమాదం నష్టం.. వంద కోట్లు!

శ్రీశైలం ప్రమాదం నష్టం.. వంద కోట్లు!

  • ఈగలపెంట జేన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ ప్రభాకర్‌రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణఅచ్చంపేట: శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం ప్రమాదంలో సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు ఈగలపెంట జెన్‌కో సీఈ ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1,2వ యూనిట్ల ద్వారా 15 రోజుల్లో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 4వ యూనిట్‌ పూర్తిగా దెబ్బతిన్నదని, ప్లాంట్‌లోకి వెళ్లి పనులు చేపట్టేందుకు తాత్కాలిక విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుచేస్తున్నామని, ఈ పనులు కూడా 70 శాతం పూర్తిచేశామని తెలిపారు. కిందిభాగం నుంచి నీళ్లు ప్లాంట్‌లోకి రావడంతో అడుగుభాగంలో ఉన్న 15 మోటార్లు నీట మునిగి రెండు ఫ్ల్లోర్లలోకి వచ్చాయని, ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటుచేసి నీటిని బయటికి తొలగిస్తున్నామన్నారు. క్లీనింగ్‌ పూర్తయిన తర్వాతే నష్టం అంచనా వేయొచ్చని తెలిపారు. ఉద్యోగులకు మాస్క్‌లు, బూట్లు, హెల్మెట్లు,ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్లాంట్‌లో నష్టపోయిన పరికరాలను పరిశీలించేందుకుగాను జపాన్‌ కంపెనీకి ఢిల్లీలో ఉన్న వారి కన్సల్టెన్సీ ద్వారా సమాచారం అందించామని చెప్పారు.  

టర్బయిన్ల వేగం పెరుగడంతోనే షార్ట్‌ సర్క్యూట్‌?

బ్యాటరీలు మార్చే క్రమంలోనే శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  విద్యుత్‌ ప్రవాహంలో ఏర్పడిన సాంకేతిక లోపాలతో టర్బైన్ల వేగం పెరిగి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ప్యానెల్‌ బోర్డుల్లో మంటలు చెలరేగినట్టు సమాచారం.ప్రమాదం జరిగిన మరుసటి రోజే సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐడీ అధికారులు కీలక ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. సీఐడీ బృందం గురువారం రెండో దఫా విచారణ చేపట్టింది. అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులుఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలతో కూడిన 12 మంది బృందం ఉదయమే ఈగలపెంటకు చేరుకొని జెన్‌కో సీఈ ప్రభాకర్‌రావుతో సమావేశమైంది. అనంతరం పవర్‌ ప్లాంట్‌లోకి వెళ్లి విచారణ చేపట్టింది. సొరంగం నుంచి బయటికి వచ్చే మూడు మార్గాలను, ప్రమాదం జరిగిన ప్యానెల్‌బోర్డు ప్రాంతాలను కలియ తిరిగి వివరాలు నమోదుచేసుకున్నట్టు తెలిసింది. ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తుతానికి అగ్నిప్రమాదం, సీఆర్‌పీసీ 174 సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేశారు. మరే కొత్త కోణం తెలియనందున ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్లలో మార్పులు చేయలేదని పేర్కొన్నారు. 


logo